ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు ఐపిఎస్‌

తిరుపతి : జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు ఐపిఎస్‌ మంగళవారం ఉదయం తిరుపతి నగరంలోని పూర్ణకుంభం, సెంట్రల్‌ పార్కు తో పాటు పలు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసి, ట్రాఫిక్‌ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ … ప్రజలెవ్వరూ రోడ్లపై రాంగ్‌ పార్కింగ్‌ చేయకూడదన్నారు. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్కింగ్‌ చేయాలన్నారు. ప్రతి ఒక్క వాహనదారులు వన్‌ వే ఉన్న రోడ్లలో ఎదురు దిశగా వెళ్లకూడదని చెప్పారు. సిగ్నల్‌ వద్ద సహనం వహించి గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నప్పుడు మాత్రమే రోడ్డును దాటాలన్నారు. సిగ్నల్‌ జంప్‌ చేసి వేరే పక్క గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నవారికి ఇబ్బంది కలిగించకుండా బాధ్యతాయుతంగా ఉంటూ, సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని జిల్లా ఎస్పీ తెలిపారు. షాపులు వద్ద గజిబిజిగా రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్కింగ్‌ చేస్తే షాపుల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటిస్తూ షాపులవారు వ్యాపారం చేసుకోవాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగిస్తే అట్టి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. త్రిబుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్పారు. రాష్‌ డ్రైవింగ్‌, స్నేక్‌ డ్రైవింగ్‌ చేసే ఆకతాయిలపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని.. రెండవసారి కూడా అలాగే డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ను రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది కూడా నిరంతరం నగరంలో తిరుగుతూ ట్రాఫిక్‌ ను నియంత్రించాలని జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఐపిఎస్‌., గారు ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ట్రాఫిక్‌ డిఎస్పి రమణ కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️