మాట్లాడుతున్న జొన్న శివశంకరరావు
ప్రజాశక్తి తాడేపల్లి రూరల్ : కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగే నిరసనలను జయప్రదం చేయాలని రైతుసంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. సంఘం మండల అధ్యక్షులు ఎం.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని మేక అమరారెడ్డి భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. శివశంకరరావు మాట్లాడుతూ దేశంలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా కేంద్ర బడ్జెట్‌లో మాత్రం 2.5 1 శాతమే కేటాయించారని, ఎరువుల సబ్సిడీలో రూ.3412 కోట్లు కోత విధించారని విమర్శించారు. వ్యవసాయ కూలీలు, కౌలురైతుల గురించిర మద్దతు ధరల గురించి ప్రస్తావనే బడ్జెట్లో లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 2020- 21 బడ్జెట్లో రూ.1,110170.86 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ.86 వేల కోట్ల మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5396 కోట్లు కేటాయిచినా నిర్వాసితుల పరిహారం, పునరావాసం గురించి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం సరికాదన్నారు. సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు డి.వెంకటరెడ్డి, పి.కృష్ణ మాట్లాడుతూ విభజన హామీలను కేంద్ర బడ్జెట్ విస్మరించిందని, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం పోర్టుకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో అందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో కె.ఈశ్వరరెడ్డి, టి.బక్కిరెడ్డి, టి.కొండయ్య, హనుమంతరావు, సాంబశివరావు పాల్గొన్నారు.
