ఇవిఎంల అప్పగింతలో అగచాట్లు

May 14,2024 22:31

మధ్యాహ్నం 12గంటల వరకు ఇవిఎంల తరలింపు

రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌

తిరుగుముఖంలో బస్సులు లేక అగచాట్లు

అర్ధరాత్రి రహదారిపై పడిగాపులు

లెండీ కళాశాల నుంచి విజయనగరానికి నడక

రవాణా సౌకర్యం కల్పించని అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం ఇవిఎంలను రిసెప్షన్‌ సెంటర్లకు అప్పగించేందుకు పోలింగ్‌ సిబ్బంది పడరాని పాట్లూ పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి రాత్రి 7గంటల నుంచి ప్రారంభమైన ఎంవిఎంల తరలింపు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని నాలుగైదు చోట్ల సోమవారం రాత్రి 2గంటల వరకు పోలింగ్‌ కొనసాగడంతో ఆ ఇవిఎంలను రిసెప్షన్‌ కేంద్రాలకు రావడం ఆలస్యమైంది. జిల్లాలోని 7నియోజకవర్గాలకు గాను విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు సంబంధించి జెఎన్‌టియు కళాశాలలోను, రాజాం, చీపురుపల్లి నెల్లిమర్ల , గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల ఇవిఎంలను అప్పగించేందుకు లెండి కళాశాలలో రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఐదు నియోజకవర్గాల కేంద్రాలకు సంబంధించిన ఇవిఎంలను అప్పగించేందుకు ఒకేచోట రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోను ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ముగిసింది. గతంలో నియోజకవర్గ కేంద్రంలోనే రిసెప్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడే ఇవిఎంలను స్వీకరించి, అనంతరం అక్కడి నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేవారు. కానీ ఈసారి ఒకేచోట ఏర్పాటు చేయడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కొత్తవలస, ఎస్‌.కోట, భోగాపురం, గుర్ల, రాజాం తదితర మండలాల నుంచి మంగళవారం ఉదయం 10గంటల వరకు ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. జొన్నాడ వద్ద జాతీయ రహదారి నుంచి లెండీ కళాశాలకు వెళ్లేందుకు చిన్నపాటి రహదారి మాత్రమే ఉండడంతో సోమవారం రాత్రి 9గంటల నుంచి మంగళవారం ఉదయం 10గంటల వరకు ఇవిఎంలను తరలిస్తున్న వందలాది బస్సులు నిలిచిపోయాయి.

       ఒక్కసారిగా వందల సంఖ్యలో బస్సులు చేరుకోవడంతో లోపలకు వెళ్లే తోవలేక ఒక బస్సును ఇంకోబస్సు తప్పించు కోలేని పరిస్థితి ఏర్పడింది.దీంతో రిసెప్షన్‌ సెంటర్లుకు ఇవిఎంలను అందించడానికి 2గంటల సమయం పట్టింది. తీరా రిసెప్షన్‌ కేంద్రాలకు వచ్చిన తరువాత ఇవిఎంలను, మెటీరియల్‌ను అప్పగించేందుకు బారులు తీరారు. రిసెప్షన్‌ కేంద్రాల వద్దే సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. మరోవైపు రెండు రోజులు పాటు పోలింగ్‌ సిబ్బందికి సక్రమమైన భోజనాలు లేకపోవడంతో అల్లాడిపోయారు. మెటీరియల్‌ను అప్పగించిన తరువాత ఇళ్లకు చేరుకునేందుకు అధికారులు ఎటువంటి రవాణా సౌకర్యం కల్పించక పోవడంతో అర్ధరాత్రి ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. రిసెప్షన్‌ కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించినప్పటికీ అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు గంటల తరబడి వాహనాల కోసం జాతీయ రహదారిపైనే వేచి ఉండాల్సి వచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది మహిళా ఉద్యోగులు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయడంతో వారు వచ్చి ద్విచక్ర వాహనాలు,కార్లలో తీసుకెళ్లారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు జొన్నాడ నుంచి నడుచుకుంటూ ఆర్‌టిసి విజయనగరం చేరుకున్నారు. ఎన్నికల అధికారులు సక్రమంగా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్‌ సైతం సక్రమంగా ఇవ్వకపోవడంతో అధికారులు తీరుపై మండిపడ్డారు.
➡️