ప్రజాశక్తి-తర్లుపాడు: ప్రజలందరి భాగస్వామ్యంతో చెత్తరహిత, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని గ్రామ పంచాయతీ అధికారులకు మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి వై భాగ్యలక్ష్మి తెలిపారు. మండల కేంద్రమైన తర్లుపాడు లోని చెత్త సంపద కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. గతంలో అధ్వానంగా దర్శనమిచ్చిన డంపింగ్ యార్డ్, ప్రస్తుతం చుట్టూ ఫెన్సింగ్ వేసి కొంతమేర శుభ్రంగా ఉండటంతో హర్షం వ్యక్తం చేశారు. సత్వరమే డంపింగ్ యార్డ్ పనులను పూర్తి చేసి, బోర్డు ఏర్పాటు చేయాలని, పిల్లర్లపై స్లోగన్లు రాయించాలని తెలిపారు. ఈ సందర్భంగా తర్లుపాడులో రోడ్లపై చెత్త వేస్తున్నారన్న ప్రజల ఫిర్యాదుపై స్పందించిన డిఎల్పిఓ, ఆయా ప్రదేశాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రజలు, దుకాణ యజమానులు బహిరంగ ప్రదేశాలలో, రోడ్ల పక్క, రోడ్లమీద వేసిన వారిపై చర్యలు తప్పవని, భారీగా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. దుకాణదారులు వ్యాపార లైసెన్సులు పంచాయతీ నుంచి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో 60,70 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ మరుగుదొడ్లను కూల్చి, అక్రమంగా బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని ప్రజలు ఆమెకు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ నిర్మాణ పనులు నిలుపుదల చేసి, వారి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని డిఎల్పిఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె శుభాకర్, సీవో అనిల్, సర్పంచ్ భర్త పి ప్రభాకర్, గ్రామప్రజలు పాల్గొన్నారు.
