సమీక్షలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం గురజాల ఆర్డీఓ కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని ఆర్‌డిఒకు సూచించారు. భూ సంబంధిత విషయాల్లో అవకతవకులు పాల్పడవద్దని, రికార్డులు తారుమారు చేయడం వంటివి చేయవద్దని అన్నారు. తెలియక తప్పు చేస్తే పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. రెవిన్యూ సంబంధిత విషయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా కాకుండా చూడాలన్నారు. గురజాల డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. డివిజన్ పరిధిలో పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉందని, గుత్తికొండ బిలం, దైద వంటి క్షేత్రాలను పర్యాటక అభివృద్ధి దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాగార్జునసాగర్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి ప్రత్ఞి చేయించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.