మోసగాళ్ల మాటలు నమ్మొద్దు

Apr 3,2024 21:51

 ప్రజాశక్తి-పాచిపెంట : ఎన్నికల సమయంలో ప్రజల ముందుకొచ్చే మోసగాళ్లు, వేషగాళ్ల మాటలు నమ్మొద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఓటర్లను కోరారు. మండలంలోని పాంచాలి గ్రామంలో రెండో రోజు బుధవారం డిప్యూటీ సిఎం రాజన్న దొర మండు టెండలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రాజన్నదొరకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సుపరిపాలనకే ఓటు వేయాలని గ్రామస్తులను ఆయన కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని చెప్పారు. ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగుతున్నారని, దేశంలో అటువంటి దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక నేత జగన్‌ మాత్రమేనని తెలిపారు. మళ్లీ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాలంటే ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నారాయణరావు, పెద్దిబాబు, గొట్టాపు ముత్యాలనాయుడు, డోల బాబ్జి, టి.గౌరీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️