ప్రజాశక్తి -గాజువాక : షీలానగర్ టోల్‌గేట్ వద్ద విశాఖ పోర్ట్ నిర్మించనున్న బొగ్గు పొడి నిల్వల గొడౌన్‌ను తక్షణమే నిలుపుదల చేయాలని మింది, అక్కిరెడ్డిపాలెం, పంచవటి గ్రామాల ప్రజలు, అఖిలపక్ష పార్టీల నేతలు కోరారు. సోమవారం నిర్మాణాలను పరిశీలనకు వచ్చిన విశాఖపట్నం పోర్ట్ అధికారి శాంతి స్వరూప్‌ను నిలదీసి ప్రశ్నించారు.గ్రీన్ పెట్రోలియం నిల్వల కోసం నిర్మిస్తున్న గొడౌన్లతో భూఉపరితల వాతావరణం దుమ్ము, ధూళిమయం కావడంతోపాటు, భూగర్భ జలాలు కలుషితమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ నాయకులు ఎ.లోకేశ్వరరావు మాట్లాడుతూ, గెడ్డలు పూడ్చిగొడౌన్ నిర్మించడం వల్ల భవిష్యత్తులో ముంపు ప్రమాదం తప్పదన్నాఉ. గొడౌన్ల కోసం గ్రీన్‌బెల్ట్ పూర్తిగా తొలగించడంతో ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా నిబంధనలకు విరుద్దంగా గొడౌన్లను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి నేత అనంతలక్ష్మి, వైసిపి నేత లతీష్, పంచవటి వాసులు ఐ.చిన్నారావ్, రామ్మోహనరావు పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న బాధితులు