తాగునీటి క్యాన్‌ ధరలను పెంచవద్దు

Dec 1,2024 01:25

ప్రజాశక్తి – మాచర్ల : మున్సిపాలిటీ తరపున అనేక ఖర్చులు చేస్తున్నామని, పేదలకు అందించే వాటర్‌ క్యాన్‌ ధర రూ 2ను పెంచకపోవటం మంచిదని కౌన్సిలర్‌ షేక్‌ సుభాని కోరారు. శనివారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ హల్‌లో కౌన్సిల్‌ సమావేశం చైర్మన్‌ పోలూరి నరసింహరావు అధ్యక్షతన జరిగింది. సుభాని మాట్లాడుతూ తాగునీరు క్యాన్‌ ధరను రూ.2 నుండి రూ.5కు పెంచటాన్ని వ్యతిరేకించారు. కౌన్సిలర్‌ గట్ల అరుణకుమారి మాట్లాడుతూ కెసిపి వారు మాచర్ల టౌన్‌కు చేసిన మేలు ఏమి లేదని, అటువంటి వారి విగ్రహలను పట్టణంలో ఎందుకు అనుమతివ్వాలని నిలదీశారు. కౌన్సిల్‌ ఎజెండాలో రింగ్‌ రోడ్డు కూడలిలో కెసిపి సంస్థల ఫౌండర్‌ వెలగపూడి రామక్రిష్ణ విగ్రహం ఏర్పాటుపై చర్చ జరిగింది. సుభాని మాట్లాడుతూ ఆయన విగ్రహం బదులుగా నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి నాగిరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహల ఏర్పాటు వలన ముఖ్యమైన కూడళ్ళలో పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురు ఆవుతున్నట్లు పలువురు వివరించారు. చివరికి ఎన్‌టిఆర్‌, వెలగపూటి రామక్రిష్ణ, మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి నాగిరెడ్డి విగ్రహలను ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. 2003 నుండి ఇప్పటి వరకు కూరగాయాల మార్కెట్‌ షాపుల అద్దె మొత్తం కేవలం రూ.800 ఉందని, దీనిని రూ.4వేలకు పెంచటం సరికాదని కౌన్సిలర్‌ శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. ఇందుకు స్పందించిన కౌన్సిలర్‌ సుభాని మాట్లాడుతూ మార్కెట్‌ సెంటర్‌ అత్యంత విలువైన ప్రాంతమని, అక్కడ నిర్ణయించిన రూ 4.వేలు అద్దె సరిగానే ఉన్నట్లు వివరించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి పరీక్షకు రూ.3.30 లక్షలతో ల్యాబ్‌ ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కెసిపి వెనుక వైపు నుండి రైల్వే స్టేషన్‌ రహదారి గుండా ఇందిరాగాంధి బొమ్మ వరకు కాల్వల్లో పూడిక తొలగింపుకు రూ.5 లక్షలు, పట్టణంలోని ఇతర మేజరు కాలువల్లో పూడిక తొలగింపుకు రూ.2.77 లక్షలు, లైట్లు, వాటి పనిముట్లకు రూ.2.50 లక్షల ఖర్చుకు, రూ.3.50 లక్షలతో ట్రాక్టర్ల మరమ్మతులకు, డంపింగ్‌ యార్డులో చెత్తను లెవల్‌ చేసేందుకు, యార్డుకు రాకపోకలు సాగించే రహదారి మరమ్మతులకు రూ.4.50 లక్షలు వ్యయానికి కౌన్సిల్‌ ఆమోదించింది. సున్నం బ్లీచింగ్‌ కొనుగోలుకు రూ.2 లక్షల కేటాయింపుకు, నూతన పుష్‌కార్టులు కొనుగోలుకు, ఉన్న వాటి మరమ్మత్‌లకు, వీల్‌ బార్స్‌ మరమ్మతులకు, పారలు కొనుగోలుకు రూ.2 లక్షలు వ్యయం చేసేందుకు, దంతెలు, సలకపారలు, పలుగులు కొనుగోలుకు రూ.2 లక్షలు వ్యయం చేసేందుకు, 12 కాంపాక్టర్‌ బిన్స్‌ కొనుగోలుకు రూ.4.70 లక్షలు వ్యయం చేసేందుకు కౌన్సిల్‌ ఆమోదించింది. సమావేశంలో కమిషనర్‌ వేణుబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️