అపర్ణ అపార్ట్‌మెంట్ వద్ద పంట కాల్వలో కలుస్తున్న మురుగునీరును పరిశీలిస్తున్న పి.మధు, వై.నేతాజీ తదితరులు
ప్రజాశక్తి తాడేపల్లి రూరల్ : పొలాలకు నీరందించే ఆంధ్రరత్న పంపింగ్ స్కీం పంట కాల్వలోకి అపార్ట్మెంట్ల నుండి మురుగునీరు, వ్యర్థాలను రాకుండా నివారించాలని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వను కలుషితం చేయకుండా రైతులకు సహకరించాలని వ్యాపార సంస్థలను, చిరు వ్యాపారులను, స్థానిక ప్రజలను ఆయన కోరారు. కుంచనపల్లిలోని కాల్వను ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం పరిశీలించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, కాలుష్యం బారిన పడి ప్రజలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డ్రెయినేజీ నీరు పంట కాల్వలో కలుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మురుగు నీరును అధికారులే మోటార్ల ద్వారా బకింగ్‌హామ్ కాల్వలో కలపటం దుర్మార్గమన్నారు. మాంసం, చేపలు విక్రయాలు చేస్తూ, పంట కాల్వలో వ్యర్థాలు వేయడంతో ఈ ప్రాంతంలో దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కుంచనపల్లి సమీపంలోని అపర్ణ బహుళ అంతస్తుల భవనం నుండి మురుగునీరు, వ్యర్ధాలు పంట కాల్వలో పెట్టేందుకు పైపులైన్లతో ఏర్పాటు చేశారని, దీనివల్ల పొలాలు చౌడుగా మారరడంతోపాటు రైతులు, కూలీలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. 30 వేల మందికి విద్యను అందించే కేఎల్ యూనివర్సిటీ రహదారి గుంతల మయంగా మారినా విస్తరణ పనులను వదిలేశారని అన్నారు. పన్నుల భారం పెంచుతున్నా పారిశుధ్యాన్ని మాత్రం మెరుగుపర్చడం లేదని విమర్శించారు. భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి జనం అవస్థ పడుతున్నారన్నారు. పటిష్ట డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుంటే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలో రోడ్లు బంద్ చేస్తామని హెచ్చరించారు. మురుగు నివారణ సమస్య శాశ్వత పరిష్కారం కోసం సిఎస్‌ఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఐక్య కార్యచరణ కమిటీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై.నేతాజీ, ఎం.రవి, బి.వెంకటేశ్వరరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు, పౌర సంక్షేమ సంఘం నాయకులు జె.శేషయ్య, సుబ్బారావు, వి.దుర్గారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, ఎ.రంగారావు, కె.కరుణాకరరావు, వై.బర్నబాస్, కె.బాబురావు, కె.సాంబశివరావు, ఎన్.విజయరాజు, డి.రాజేంద్రబాబు, జి.గోపాలరావు, ఎ.రామారావు, టి.భక్కిరెడ్డి పాల్గొన్నారు.
