వికలాంగులను కించపరిచేలా మాట్లాడొద్దు

Apr 3,2024 21:33

 ప్రజాశక్తి-విజయనగరం :  రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభా వంతులను కించపరిచే పదాలను వాడవద్దని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం లాంటి పదాలను వాడటం వల్ల వికలాంగుల మనోస్థైర్యం దెబ్బతింటోందని, వారు తీవ్ర మనస్థాపం చెందుతూ తమకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఇతరులను కించపరిచే పదాలను ప్రచారంలో వాడకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ , ఓటర్ల జాబితా సవరణ గురించి ముందుగా వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10వేల కొత్త ఓటర్లను చేర్చామన్నారు. కొత్త ఓటర్లు ఓటు కోసం ధరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14వరకు అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కేవలం ఓట్ల చేర్పింపు మాత్రమే జరుగుతుందని, మిగిలిన వాటికి అవకాశం లేదని తెలిపారు. 18 ఏళ్లలోపు బాల బాలికలను రాజకీయ కార్యకలాపాల్లో వినియోగించకూడదని చెప్పారు. పార్టీల ప్రచారం, పాంప్లెట్లు, జెండాల పంపిణీ, ర్యాలీలు, నినాదాలు ఇవ్వడంతోపాటు, రాజకీయ పార్టీలు ప్రదర్శించే సాంస్కతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలను వినియోగించ కూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేసే వ్యయం అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్‌ దాఖలు చేసిన తరువాత అభ్యర్ధి ఖాతాలో లెక్కిస్తారని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, వివిధ నియోజకవర్గాల ఆర్‌ఒలు, నోడల్‌ ఆఫీసర్లు, తాహశీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️