సైరన్‌ మోగితే ఇలా చేయండి..

May 7,2025 22:20

మాక్‌డ్రిల్‌ నిర్వహణలో పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:
భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ పోలీసులు బుధవారం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల వద్ద మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్‌పి రమణమూర్తి ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై మాక్‌ డ్రిల్‌ను ఎస్‌పి సతీష్‌కుమార్‌ పరిశీలించారు. మాక్‌డ్రిల్‌ కోసం వచ్చిన పోలీస్‌, రెవెన్యూ శాఖ, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ తదితర అధికారులకు, సిబ్బందికి మాక్‌డ్రిల్‌ నియమాల గురించి, ఆ సమయంలో వారు చేయాల్సిన పనుల గురించి వివరించారు. మొదటగా మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్‌ ఆధారంగా ప్రత్యేక బలగాల సిబ్బంది సామాన్య పౌరుల వలె స్వీయ రక్షణ కొరకు అకస్మాత్తుగా కింద పడుకుని పెద్ద శబ్దాలను తట్టుకోవడానికి వారి రెండు చేతులతో రెండు చెవులను మూసుకుని, కదలకుండా బోర్లా పడుకున్నారు. కొంచెం దూరంలో ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించటం కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బంది వారిని అంబులెన్స్‌లోకి తీసుకువెళ్లారు. వెంటనే ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలను కనిపెట్టే బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విస్తత తనిఖీలు చేపట్టి, దొరికిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. మాక్‌ డ్రిల్‌లో ప్రయాణికులు, పౌరులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదనపు ఎస్‌పి హనుమంతు, డిఎస్‌పిలు అరవింద్‌, అక్కేశ్వరరావు, అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొన్నారు.

➡️