ప్రతి గ్రామంలో దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలి

Jan 7,2025 16:03 #Kurnool

ప్రజాశక్తి – ఆదోని : కులవృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రతి గ్రామంలో రజకులకు దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలని, ట్రైనింగ్ కు హాజరైన వారికి స్టైఫెండ్ మొత్తం అకౌంట్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం 2025 సంవత్సరం క్యాలెండర్ ను సిఐటియు ఆఫీసు లో ఆవిష్కరించి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కన్న జిల్లా కమిటీ సభ్యులు ఉరుకుందు ఆదోని పట్టణ అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో రజక రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. కార్పొరేషన్ కు రూ 1000 కోట్లు నిధులు కేటాయించి రజకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సొసైటీలు ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామానికి ధోబి ఘాట్లు ఏర్పాటు చేసి పనిచేసేందుకు వీలుగా నీటి సౌకర్యం కల్పించాలన్నారు. జీవో నెంబర్ 27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబంలో ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించాలన్నారు. మోడ్రన్ దోబీ ఘాట్స్ ఏర్పాటు చేయాలని అలాగే రాష్ట్రంలో రజకులపై దాడులు సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయని నిరోధించేందుకు ఎస్సీ, ఎస్టీ తరహాలో రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కౌసల్య విశ్వకర్మ ద్వారా రజకులకు జిల్లాలో దాదాపు 5వేల మందికి వారం రోజులు పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ట్రైనింగ్లో రోజుకు రూ.500 చొప్పున వారం రోజులపాటు నాలుగు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారన్నారు. ట్రైనింగ్ జరిగి రెండు నెలల అయినప్పటికీ ఇంతవరకు అకౌంట్లో జమ కాలేదన్నారు. ట్రైనింగ్ కు హాజరైన వారందరికీ రూ4000 జమ చేయాలని లేని ఎడల ఆందోళన చేస్తామన్నారు. రూ.15 వేల కిట్టు అందించాలన్నారు. బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణం అందిస్తామని చెబుతున్న పట్టించుకునే వారే లేరన్నారు.  ఈ విషయంపై అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆదోని పట్టణ రజక సంఘం ఉపాధ్యక్షులు నాగప్ప, రవి, పట్టణ నాయకులు మల్లప్ప, పెద్ద తుంబలం మహేష్, చిన్న హరివాణం భీమలింగ, బదినే హాల్ మహేష్, రవి వున్నారు.

➡️