ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. వచ్చే నెల 7 వ తేదీ జరగనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం వాల్ పోస్టర్లను కలెక్టర్ నరసరావుపేటలోని తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి నేటి వరకు సాయుధ దళాలు దేశం లోపల, వెలుపల ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తున్నాయని, దేశ రక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాయని చెప్పారు. దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవానులు, వారిపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రమికవేత్తలు విరివిగా విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విరాళం అందజేసి పోస్టర్, కార్ ఫ్లాగ్స్‌ను, పతాక స్టిక్కర్స్‌ను ఆవిష్కరించారు. విరాళాలను డైరెక్టర్, సైనిక సంక్షేమ శాఖ, మొఘల్రాజపురం, విజయవాడ-520 010 వారికి ఆన్ లైన్ ద్వారా, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, యం.జి. రోడ్, గవర్నర్ పేట, 2 (16857) 2 30. 33881128795, IFSC Code: SBIN0016857, MICR No.520002046 ద్వారా గానీ, లేదా Director, Sainik Welfare, విజయవాడ పేరు మీద చెక్కు ద్వారా జిల్లా సైనిక సంక్షేమాధికారి, హిందూ కాలేజీ ఎదరు, గుంటూరు, గుంటూరుకు గానీ పంపాలని కోరారు.