ప్రజా ఉద్యమాలకు విరాళాలు ఇవ్వండి : సిపిఎం

Feb 11,2024 14:29 #cpm

 ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు విరాళాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు కోరారు. పట్టణంలో ఆదివారం సీపీఎం విరాళాలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి సీపీఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు పెరగడంతో అన్ని వర్గాల ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను భారాలు వేస్తున్నారన్నారు. అన్ని రంగాల సమస్యలు పరిష్కారానికి సీపీఎం నిరంతరం పని చేస్తుందన్నారు. కార్పోరేట్‌ సంస్థలు ఇచ్చే ఎలక్ట్రోల్‌ బాండ్లను తీసుకోకూడదని సిపిఎం తీర్మానం చేసి ఎన్నికల కమిషన్‌కు కూడా చెప్పినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై పని చేస్తున్న సిపిఎంకు ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారాలు స్వచ్చందంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శంకరరావు, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మండలాల కార్యదర్శులు ఎస్‌.గోపాలం, బలస శ్రీనివాసరావు, సురేష్‌ ఉన్నారు.

➡️