ఆ రోడ్డులో భారీ వాహనాలొద్దు – పిల్లల ప్రాణాలను కాపాడండి : ప్రజల ఆందోళన

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : జయప్రకాష్‌ పాఠశాల రోడ్డుపై భారీ వాహనాలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇరుకు రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం వలనే ఏడో తరగతి విద్యార్థి మణికంఠను కంటైనర్‌ లారీ ఢీకొని చనిపోయాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వాహనాలకు అనుమతి ఇవ్వవద్దని స్థానికులు కొన్ని రోజుల క్రితం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గోతులు రోడ్లుపైకి భారీ వాహనాలకు ఎలా అనుమతి ఇస్తారని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపైకి భారీ వాహనాలను అనుమతించవద్దని, రోడ్డు బాగు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలనే విద్యార్థి మణికంఠ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

➡️