పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటుకొద్దు

పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటుకొద్దు

అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నా

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : విశాఖ పోర్టు హాస్పిటల్‌ను ప్రయివేటుకు అప్పగించొద్దని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన గురువారం విశాఖ పోర్టు చైర్మన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు విఎస్‌.పద్మనాభరాజు మాట్లాడుతూ, పోర్టు గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌ను ప్రయివేటుకు ఇవ్వాలనే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హాస్పిటల్‌ను ప్రయివేటీకరణ చేయొద్దని 101 రోజులుగా కార్మికులు ఆందోళన సాగిస్తున్నారని తెలిపారు. పోర్టు సొంత నిధులతోనే హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. 40 వేల మంది కార్మిక ఆరోగ్య భద్రతను ప్రయివేటు చేతుల్లో పెట్టడం తగదన్నారు. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి బి.సిహెచ్‌ మసేన్‌ మాట్లాడుతూ, పోర్టుల్లో పిపిపి, బిఒటి విధానాలు విఫలమయ్యాయని గతంలో కాగ్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. గత అనుభవాల దృష్ట్యా పోర్టు హాస్పిటల్‌ను ప్రయివేటుకు ఇవ్వొద్దని డిమాండ్‌చేశారు. సిఎస్‌టియుఐ నాయకులు ఎన్‌.కనకారావు మాట్లాడుతూ, ఉద్యోగులు, కార్మికులు పొందే వైద్యానికి కూడా లాభనష్టాలు బేరీజు వేయడం దుర్మార్గం అన్నారు. విశాఖ పోర్టు సొంత నిధులతోనే మల్టీ-సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, స్పెషలిస్ట్‌ డాక్టర్లను, ల్యాబ్‌ మిషనరీలను,స్పెషలైజ్డ్‌ స్టాఫ్‌ను, నాణ్యమైన మందులను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ సీనియర్‌ నాయకులు కె.మంగయ్యనాయుడు, సిఐటియు నాయకులు కె.సత్యనారాయణ, జె.సత్యనారాయణ, రామలింగేశ్వరరావు, ఐఎన్‌టియుసి నాయకులు జి.చంద్రరావు, బిఎంఎస్‌ నాయకులు బి.రవిశంకర్‌ తదితరులు మాట్లాడారు.

పోర్టు చైర్మన్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

➡️