గుంటూరు దీక్షల్లో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిరసన దీక్ష నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షలను డాక్టర్ కొల్లా రాజమోహన్ పూలమాలలు వేసి ప్రారంభించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో గాంధీపార్కు వద్దగల ధర్నాచౌక్‌లో దీక్షలను సిఐటియు, ఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్.ఆంజనేయులు నాయక్, కె.రాంబాబు ప్రారంభించారు. దీక్షాపరులకు పూలమాలలేశారు. ఈ సందర్భంగా గుంటూరు దీక్షా శిబిరంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.నాసర్‌జి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, పిడిఎస్‌యు నాయకులు మానస మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, ముఖ్యంగా విద్యార్థి, యువత పాత్ర కీలకమని గుర్తు చేశారు. అటువంటి విశాఖ ఉక్కను ప్రైవేటీకరిస్తే సహించబోమని హెచ్చరించారు. తక్షణమే ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేయట్లేదని చెబుతూనే మరోవైపు 5 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని, 2500 ఉద్యోగులను బదిలీ చేశారని మండిపడ్డారు. 32 మంది ప్రజల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రతీకన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను వైసిపి కాపాడలేకపోయిందని, తాము కాపాడతామని ఎన్నికలకు ముందు చెప్పిన టిడిపి ఇప్పుడు మాట మారుస్తోందని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. దీక్షలకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టీ, సిఐటియు నాయకులు బి.లక్ష్మణరావు, కె.శ్రీనివాస్, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, మెడికల్స్ రిప్స్ యూనియన్ నాయకులు సలీం, గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు నాగరాజు సంఘీభావం తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె. సమీర్, నాయకులు నవిత, యశ్వంత్, పవన్, షంషేద్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు శశిధర్ కుమార్ పాల్గొన్నారు. నరసరావుపేట దీక్షా శిబిరంలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 1325 రోజులుగా పోరాటం జరుగుతోందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరానికి ప్రతీకగావున్న విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకుల ప్రకటనల్లో కుట్రలున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. రాష్ట్రం నుంచి స్టీల్ సహాయ మంత్రిగా శ్రీనివాస్ వర్మ ఉన్నప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడిపేందుకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కుట్రలు మానుకోకుంటే ఉద్యమం ఉధృతం అవుతుం దని హెచ్చరించారు. దీక్షలకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్, కార్మిక సంఘాల నాయకులు శిలార్, శివకుమారి, మల్లీశ్వరి, రంగయ్య మద్దతు తెలిపారు. యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆంజనేయరాజు, రాజ్‌కుమార్, సాయికు మార్, అమూల్య, శ్రీనివాస్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.
నరసరావుపేట దీక్షల్లో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు