విదేశీ బీమా కంపెనీలు వద్దు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రపంచ స్థాయి పనితీరు కనబరుస్తున్న ఎల్‌ఐసి ఉండగా, దేశంలోకి దివాలా తీసిన విదేశీ బీమా కంపెనీలను అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించడం బాధ్యతారాహిత్యమని ప్రముఖ సర్జన్‌ డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, సిటిజన్స్‌ ఫోరం కార్యదర్శి లక్ష్మీరాజా, శ్రామిక మహిళా కన్వీనర్‌ సుబ్బమ్మ, బ్యాంకు ఉద్యోగుల కన్వీనర్‌ శ్రీనివాసుల రెడ్డి, పెన్షనర్స్‌ రాష్ట్ర నేత నాగముని రెడ్డి, సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కమిటీ కన్వీనర్‌ రఘునాథ్‌ రెడ్డి అన్నారు. బుధవారం కడప నాగరాజుపేట డిసిసి బ్యాంకు సమీపంలో సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగినట్లు పాలసీలు, గొప్ప సేవలు అందిస్తూ, బాధ్యతగా క్లెయిమ్‌ లు చెల్లిస్తున్న ఎల్‌ఐసికి పోటీ పడగలిగిన సంస్థ దేశంలో గానీ, ప్రపంచంలో గానీ ఏదైనా ఉందా అని వారు నిలదీశారు. పాలసీదారుల ప్రయోజనాల కోసం జిఎస్‌టి తొలగించాలని, జీవిత బీమా ప్రీమియాలకు ప్రత్యేక పన్ను రాయితీ ఇవ్వాలని, ఎల్‌ఐసి సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 400 మంది పార్లమెంట్‌ సభ్యులు సిఫారసు చేస్తే ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అవధానం శ్రీనివాస్‌, అక్బర్‌ బాషా, వసుప్రద, రామాంజనేయులు, సుధీకర్‌, శ్రీనివాసులు, నిత్యానంద రెడ్డి, శివారెడ్డి (ఇన్సూరెన్స్‌) శ్రీనివాసులు రెడ్డి, అజీజ్‌, జగదీష్‌ (బ్యాంకింగ్‌), మహేష్‌ (యుటిఎఫ్‌), సుబ్బారెడ్డి (పోస్టల్‌), రామకష్ణారెడ్డి (పెన్షనర్స్‌) సుబ్బారావు, సుధాకర్‌ ( టెలికం), రామానుజుల రెడ్డి (మెడికల్‌ రిప్స్‌), సుబ్బమ్మ (శ్రామిక మహిళ), లక్ష్మీదేవి (అంగన్వాడి), రాహుల్‌, సరస్వతి, శ్రీనివాసుల రెడ్డి (జెవివి) పాల్గొన్నారు.

➡️