హెల్మెట్‌ పెట్టుకోక.. ప్రాణం మీదికి..

May 16,2024 00:19

ప్రజాశక్తి – నాదెండ్ల : హెల్మెట్‌ ఉన్నా పెట్టుకోని నిర్లక్ష్యం యువకుని ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ చదివిన విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని కనపర్రు బావి వద్ద బుధవారం జరిగింది. ఎస్‌ఐ బలరామిరెడ్డి వివరాల ప్రకారం.. నరసరావుపేట పట్టణంలోని సాయినగర్‌కు చెందిన కమ్మ ఈశ్వర్‌కృష్ణ ప్రసాద్‌ (23) బెంగళూరులో బీటెక్‌ పూర్తి చేశాడు. మంగళవారం చిలకలూరిపేటలో తన అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా నరసరావుపేట- చిలకలూరిపేట రహదారిలోని కనపర్తి భావి వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢకొీట్టాడు. ఈ ఘటనలో ఈశ్వర్‌కృష్ణప్రసాద్‌ కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అయితే బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి హెల్మెట్‌ ఉన్నా దాన్ని పెట్టుకోకుండా ద్విచక్ర వాహనం హ్యాండిల్‌కు తగిలించాడు. అదే పెట్టుకుని ఉంటే ప్రాణమీదికి వచ్చేది కాదేమో. మృతుని తండ్రి శివరాం ప్రసాద్‌ నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌ కాగా తల్లి ఉపాధ్యాయిని. వీరి ఏకైక కుమారుడు ఈశ్వర్‌కృష్ణప్రసాద్‌ మృతితో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

➡️