హెచ్‌ఎంపివి పట్ల ఆందోళన వద్దు

Jan 7,2025 21:21

ప్రజలు తమవంతు సహకారం అందించాలి : డిఎంహెచ్‌ఒ జీవనరాణి

ప్రజాశక్తి-విజయనగరం కోట :  హెచ్‌ఎంపివి వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి చెప్పారు. కోవిడ్‌ సమయంలో తీసుకున్న మాదిరిగానే తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. తమ ఛాంబర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్‌ఎంపివి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం తదితర ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఇదేమీ అంత ప్రమాదకరం కాదని, ఆందోళన చెందవద్దని సూచించారు. సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు జిల్లాలో అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్నామని తెలిపారు. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. ఏ వ్యాధిని అదుపు చేయాలన్నా, అరికట్టాలన్నా ప్రజల సహకారం తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. వ్యాధులను అదుపుచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలకు 24 గంటలూ మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభిస్తామని తెలిపారు. శరీరంపై స్ఫర్శ లేని మచ్చలు, ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే తమ సిబ్బందికి తెలియజేయాలని డిఎంఅండ్‌హెచ్‌ఒ సూచించారు. విలేకర్ల సమావేశంలో డిటిఒ డాక్టర్‌ కె.రాణి, జిల్లా మలేరియా నివారణాధికారి మణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️