కాలువ కప్పేసి రోడ్డు నిర్మాణం

Mar 10,2025 21:16

 ఓ పెత్తందారుడి దురాక్రమణ

350ఎకరాలకు సాగునీరు ప్రశార్థకం

ఆర్‌ఐ, విఆర్‌ఒ పరిశీలించినా పట్టించుకోని వైనం

చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఇది రామవరం నుంచి రాకోడు వైపు వచ్చే సాగునీటి కాలువ. ఈ కాలువ ద్వారా వచ్చిన నీటితో రాకోడు గ్రామ పరిధిలోని అనేక చెరువులు, బందలు నిండుతాయి. వీటి ద్వారా సుమారు 350ఎకరాల సాగు భూమికి సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో పెద్దగా సాగునీటి వనరులు లేకపోయినా ఈ కాలువ ఉందనే ధైర్యంతో స్థానిక రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ఇంతటి జీవనాధారమైన కాలువ గట్టును తవ్వేసి, తవ్వగా వచ్చిన మట్టిని కాలువలో కప్పేసి దర్జాగా రోడ్డువేసేసుకున్నాడు రాకోడుకు చెందిన ఓ పెత్తందారు. దీంతో, తీవ్ర కలతచెందిన రైతులు స్థానిక విఆర్‌ఒ, ఆర్‌ఐలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. విజయనగరం మండలం రాకోడు గ్రామానికి పెద్దగా సాగునీటి వనరులు లేవు. రామవరం మీదుగా రాకోడు ఎగవ ప్రాంతం నుంచి వచ్చే సాగునీటి కాలువే పంటల సాగుకు అత్యంత కీలకం. ఆ కాలువ వెంబడి నీరు పారిందంటే ఆ గ్రామ పరిధిలోని పాత చెరువు, అన్నంరాజు చెరువు, ఎంకో చెరువు, బారీ బంద, బాపన బంద, రాళ్లబంద నిండినట్టే. వీటి కింద ఉన్న సుమారు 350 ఎకరాల సాగు భూమికి నమ్మకంగా నీరు అందుతుంది. భూమి కూడా సారవంతంగా ఉండడంతో దిగుబడికి కూడా ఢోకా లేదు. ఇటువంటి భూమికి సాగునీరందించే సాగునీటి కాలువ గట్టును రంధి సాధూరావు అనే వ్యక్తి యధేచ్ఛగా ఆక్రమించుకున్నాడు. వాస్తవానికి రాకోడు గ్రామ రెవెన్యూ శివారు ప్రాంతంలో సాధూరావు సుమారు ఏడు ఎకరాల భూమి ఇటీవల కొనుగోలు చేశాడు. అక్కడికి పొలం గట్లపై నుంచే వెళ్లాల్సివుంటుంది. విశాఖనగరంలో ఉంటున్న ఆయన అప్పుడప్పుడు తన వ్యవసాయ క్షేత్రానికి కారుపై వస్తుంటాడు. ఈనేపథ్యంలో నేరుగా కారు తన పొలంలోకి వెళ్లాలంటే కాలువగట్టే మార్గమని భావించాడు. అనుకున్నదే తడువుగా కారు వెళ్లేందుకు వీలుగా సర్వే నెంబర్‌ 82, 94,95, 27 పరిధిలోవున్న ఆ గట్టును జెసిబితో చదును చేయించి మట్టిరోడ్డు వేయించాడు. కారు వెళ్లేందుకు గట్టు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో కాలువను కూడా కప్పేశాడు. దీంతో కాలువ కుశించిపోయింది.రాజకీయ అండతోనే కాలువను, గట్టును రాజకీయ అండతోనే సాధూరావు అక్రమించాడన్న విమర్శలు గ్రామంలో ఊపందుకున్నాయి. సాధూరావు వైసిపి పార్టీకి చెందిన వారైనప్పటికీ టిడిపి నాయకులు కూడా ఒకరిద్దరు ఆక్రమణ దారుడికి కొమ్ముకాస్తున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా కొన్ని రోజుల వ్యవధిలోనే మొత్తం పనికానిచ్చేశాడు. దీంతో, ఆగ్రహించిన పేదలు నాయకుల ద్వారా న్యాయం జరిగే పరిస్థితి లేకపోవడంతో స్థానిక విఆర్‌ఒ, ఆర్‌ఐలకు లిఖిత పూర్వకంగానే ఫిర్యాదు చేశారు. ఇద్దరూ క్షేత్ర స్థాయి పరిశీలన చేసినప్పటికీ ఆ క్రమణ దారుడిని హెచ్చరించడం లేదా అతనికి నోటీలు వంటివి కూడా ఇవ్వలేదు. దీంతో గత్యంతరం లేని రైతులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికకు వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

చర్యలు తీసుకోకపోతే రోడ్డున పడతాం

పాత చెరువు కాలువ, గట్టు ఆక్రమణపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే గ్రామంలోని రైతులందరం రోడ్డున పడతాం. ఆ కాలువ నీరే మా పంటల సాగుకు ఆధారం. ఇటువంటి కాలువను సాధూరావు అనే వ్యక్తి తన ఏడు ఎకరాల కోసం 350 ఎకరాలకు సాగునీరు అందించే కాలువను ఆక్రమించి రోడ్డు వేసుకోవడం సరికాదు. అధికారులు స్పందించకపోతే ఆందోళన తప్పదు.

బండారు శ్రీను, రైతు, రాకోడు గ్రామం

➡️