తాగునీటి ఎద్దడి నివారణకు ఆండ్రనీరు

Mar 11,2025 21:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా మంగళవారం ఆండ్ర జలాశయం నుండి నీటిని విడుదల చేయించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య తెలిపారు. ఆయన ఆదేశాలతో ఇఇ టి.రాయల్‌ బాబు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు ఆండ్ర ప్రాజెక్టు వద్దకు వెళ్లి, అక్కడ విడుదలవుతున్న నీటి ప్రక్రియను పరిశీలించారు. ఆండ్ర ప్రాజెక్టు గేట్‌ నెంబర్‌ 2 నుండి ఈ మేరకు నీటిని విడుదల చేశారు. కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సూచనలతో ఇరిగేషన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా నీటి విడుదలకు చొరవ చూపాలని కోరగా, అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టారు. ఆండ్ర జలాశయం నుండి నేరుగా మర్రివలస, పిట్టాడ, మెంటాడ, గజపతినగరం, డోలపేట, జీవపేట మీదుగా మొత్తం 40 కిలోమీటర్లు ప్రవహించి నెల్లిమర్ల వద్దనున్న చంపావతి నది వాటర్‌ ప్రాజెక్ట్‌ వద్దకు చేరుతుంది. అక్కడ ఇన్‌ఫిల్ట్రేషన్‌ ఊటబావుల వద్ద నుండి నెల్లిమర్ల మాస్టర్‌ పంప్‌ హౌస్‌ ద్వారా విజయనగరం నగరపాలక సంస్థకు నీటి పంపిణీ జరుగుతుందని కమిషనర్‌ పల్లి నల్లనయ్య తెలిపారు. ఆండ్ర నుండి నెల్లిమర్ల వద్దకు నీరు చేరేందుకు సుమారు వారం రోజులు కాలవ్యవధి పడుతుందని తెలిపారు. వేసవిలో కూడా నగర ప్రజలకు యథావిధిగా మంచినీటి సరఫరా చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

➡️