ప్రజాశక్తి – వీరఘట్టం : గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు పదేపదే అప్రమత్తం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో ప్రతి ఏటా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఇందుకు మండలంలోని పలు గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న మంచినీటి పథకాలే నిదర్శనం.మండలంలోని గడగమ్మ, జరడ, బట్టిగూడ, కొంచ, వీరఘట్టం తదితర గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడగమ్మలో బోరు బావులు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే నీరు తాగేందుకు పనికి రాకపోవడంతో సమీపంలో ఉన్న నాగావళి నది చెంతకు వెళ్లి చలమల నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నారు. కురుపాం మండలం జరడ గ్రామం నుండి 10 కుటుంబాలకు పైబడి కత్తుల కవిటి గ్రామ సమీపంలో పదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం వలస వచ్చారు. వీరు నివసించు ఈ ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన వారు బోరుబావి ఏర్పాటు చేసినప్పటికీ ఆ బావి నీరు తాగేందుకు పనికి రాకపోవడంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న వంకాయలగెడ్డ, కత్తుల కవిటి గ్రామాలకు ద్విచక్ర వాహనాలతో వచ్చి ప్లాస్టిక్ డబ్బాలతో నీరు తీసుకెళ్లి దాహార్తిని తీర్చుకుంటున్నారు. వండవ ఉపరితల రక్షిత మంచినీటి పథకం నుంచి కొంచ గ్రామానికి అప్పట్లో పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేసినా, అది కూడా మూడు రోజులు ముచ్చటగా మారింది. దీతో అక్కడ పైపులైన్ ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తుందని కొంచ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో వందకు పైబడి కుటుంబాలు నివాసం ఉన్నాయి. గ్రామంలోని బోరు బావులు పని చేయకపోవడంతో సమీప పాఠశాల వద్ద గల బోరు వద్దకు వచ్చి తాగునీరు తీసుకెళ్లి దాహార్తిని తీర్చుకుంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చలివేంద్రి గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వీలుగా సుమారు రూ.19 లక్షల అంచనా వ్యయంతో 90 వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి పథకం గత టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ఈ పథకం కూడా మూడు రోజులు ముచ్చటగా పని చేసి మూలకు చేరింది. దీంతో గ్రామస్తులు రక్షిత మంచినీటి పథకం వద్ద గల బోరుబావి వద్దకు వచ్చి నీరు తోడుకొని దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇక వీరఘట్టం మేజర్ పంచాయతీ కార్యాలయం వెనుక నాలుగు లక్షల సామర్థ్యం గల రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసినప్పటికీ ఈ పథకం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలజీవన్ మిషనుతో సమస్య పరిష్కారమయ్యానా?మండలంలోని 37 గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా లక్షలాది రూపాయల అంచనా వ్యయంతో బోరుబావులతో పాటు, పైప్లైన్ ఏర్పాటు చేసినప్పటికీ ఏళ్లు గడుస్తున్నా వీటి ద్వారా చుక్క నీరు కూడా రాకపోవడంతో ఇవి గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్నాయి. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో పనులు చేపట్టడంతో తాగునీటి సమస్య తీరుతుందన్న ఆశ అడియాశలయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరఘట్టం బీసీ కాలనీ సమీపంలో రూ.50లక్షలు పైబడి నిధులతో రక్షిత మంచినీటి పథకం పనులు చేపట్టినప్పటికీ అది నిరుపయోగంగా పడిఉంది. ఈ మంచినీటి పథకం నిర్మించక ముందు జామి వారి కాంప్లెక్స్ సమీపంలో రెండేళ్ల పైబడి రూ.2లక్షలతో బోరుబావి తవ్వి అక్కడి నుండి పైప్లైన్ ద్వారా నీటిని మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న రక్షిత మంచినీటి పథకానికి రెక్కించి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు అప్పట్లో పాలకవర్గం ప్రణాళికలు రచించింది. ఈ మేరకు లక్షలాది రూపాయలు వెచ్చించి బోరు బావి తవ్వకాలు జరిపినప్పటికీ వారి ఆశలకు గండిపడడంతో ఆ బోరుబావి నిరుపయోగంగా పడి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
