ప్రజాశక్తి – నెల్లిమర్ల : భవిష్యత్‌లో డ్రోన్లు కీలకపాత్ర పోషించనున్నాయని ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ అనీల్ కుమార్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంచూరియన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తొన్న వింగ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎంపవరింగ్ స్కిల్స్ త్రో డ్రోన్ టెక్నాలజీ అనే వర్క్ షాపు ముగింపు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌లో ఉపాధి అవకాశాల గురించి వివరించారు. చీఫ్ పాట్రన్‌గా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ మాట్లాడుతూ రానున్న కాలంలో డ్రోన్లు ఏయే రంగాలలో ఉపయోగించడానికి అవకాశం ఉందో వివరించారు. గిరిజన ప్రాంతాలలో నేలల స్వభావం, నీటి వనరుల లభ్యత, ఆరోగ్యసేవలు అందించడంలో డ్రోన్లు కీలకపాత్ర పోషించనున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, డాక్టర్ బొంతు కోటయ్య తదితరులు ప్రసంగించారు. అనంతరం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బీ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారు చేస్తొన్న డ్రోన్ల తయారీ, పరిశోధన, డ్రోన్ల ప్రయోగం తదితర వాటిని తిలకించారు. ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్లుగా డాక్టర్ కె.లత, డాక్టర్ ప్రేమ చట్టర్జీ, డాక్టర్ ఎన్.వి.ఎస్.సూర్యనారాయణతోపాటు డాక్టర్ ఎం.జి.నాయుడు, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ కె.దివ్య, డాక్టర్ ఎం.ప్రసాద్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.