ఎండిన చెరువుల

ఎండిపోయిన దుప్పుతూరు చెరువు

అడుగంటిన భూగర్భ జలాలు

 ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య

సబ్సిడీపై బోర్లు మంజూరు చేయాలని వేడుకోలు

ప్రజాశక్తి-అచ్యుతాపురం

ఎండలు మండిపోతుండడంతో మండలంలోని సుమారు 80 చెరువులు ఎండిపోయాయి. చుక్క నీరు లేక బీటలు వారాయి. అచ్యుతాపురం మండలం పూర్తిగా మెరక ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు అడిగింటాయి. సుమారు 400 అడుగుల లోతులో కూడా నీరు దొరకడం కష్ట సాధ్యంగా మారింది. మండలంలోని చౌడపల్లి, వెదురువాడ, గొర్లి ధర్మవరం, మార్టూరు, కుమారపురం, అచ్యుతాపురం, దుప్పుతూరు, భోగాపురం, జంగులూరు, బడుతూరు, మడుతూరు, ఆవ సోమవారం, దోసూరు, రాజానపాలెం, దొప్పర్ల తదితర గ్రామాలలో చెరువులలో ఉండే నీటిపైనే పశువులు ఆధారపడి దాహాన్ని తీర్చుకునేవి. ప్రస్తుతం ఆయా గ్రామాలలో పురాతన కాలం నుంచి ఉన్న నేల బావులు, వ్యవసాయ బావులు, చెరువులు వర్షాలు లేక ఎండిపోయాయి. చెరువులలో నీరు తాగడం అలవాటుగా మారిన ఈ ప్రాంత పాడి పశువులకు మండుటెండల కారణంగా చెరువులలో చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో మనుషులు కూడా మంచినీరు సమస్య ఎదుర్కొంటున్నారు. గృహాల వద్ద కోసిన గొట్టపు బావులు కూడా ఎండిపోయి నీరు రావడంలేదని గృహ యజమానులు లబోదిబోమంటున్నారు. గహ అవసరాల కోసం 200 నుంచి 300 అడుగుల లోతు గొట్టపు బావులు తవ్వించడానికి సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అంతా ఆర్థిక భారం తాము మోయలేదని ప్రజలు అంటున్నారు. నీరు లేకపోవడంతో అనేక మంది అప్పు చేసిన కొత్తగా బోర్లు వేయించుకున్నారు. పాడి పశువులకు దాహార్తిని తీర్చడానికి అంత మొత్తంలో ఖర్చు పెట్టడం రైతులకు సవాల్‌గా మారింది. రైతులకు పంట పొలాలలో వ్యవసాయ బోర్లు వేయటానికి ప్రభుత్వం సబ్సిడీపై గొట్టాలు, విద్యుత్‌ మోటారు, మంజూరు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. భూగర్భ జలాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో జియాలజిస్ట్‌ ద్వారా ఉచితంగా సర్వే చేయించి రైతులకు సూచనలు చేయించాలని రైతులు కోరుతున్నారు.

➡️