ప్రజాశక్తి -అనంతపురం క్రైం: ప్రజల శ్రేయస్సు, భద్రతలను దృష్టిలో ఉంచుకుని 31-12-2024 తేదీ రాత్రి 10 నుండీ 01-01-2025 తెల్లవారుజాము 5 గంటల వరకు నగరం లో ఉన్న మూడు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు (సైఫుల్లా బ్రిడ్జి, క్లాక్ టవర్ బ్రిడ్జి, అంబేద్కర్ బ్రిడ్జి) మూసివేస్తున్నామని అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూడు బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలు ఉండవని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని వాహనదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నిర్వహించే వేడుకలు ఇళ్లలోనే ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. రోడ్లపైకి వచ్చి మీరు ఇబ్బంది పడి, మీ నుండీ ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితికి అవకాశమివ్వరాదని కోరారు. అనంతపురంలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని, రోడ్లపై, కూడళ్లపై క్రాకర్లు కాల్చ కూడదని, వేడుకల పేర్లతో ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి నుండీ బుధవారం ఉదయం వరకు జిల్లా కేంద్రమంతటా వాహనాల తనిఖీలు, చెక్ పోస్టుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. మైనర్లు వాహనం నడిపకూడదని, వారు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు వాహన యజమానులు భాద్యత తీసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ సైకిల్ పై త్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదని, నూతన సంవత్సర వేడుకలను సాకుగా చూపి బైక్‌లు, కార్లను రేసింగ్ చేసే వారిపై, సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడపడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ , బహిరంగ ప్రదేశాల్లో రేసింగ్ చేయడం వంటివి ఎంవీ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టం ప్రకారం వాహనాలు సీజ్, రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. అనంతపురంలో ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీలలోని పరిస్థితులపై డ్రోన్ కెమేరాలతో నిఘా వేసి సిసి కెమెరాల ద్వారా ఈ సర్వేలెన్స్ నుండీ పర్యవేక్షించి ఉల్లంఘనదారులపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
