ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ పోలీసుస్టేషన్లకు డిఎస్‌పిలను నియమించాలి

Mar 11,2025 20:53

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక పోలీసుస్టేషన్లకు డిఎస్‌ పిలను నియమించాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని బహుజన సేన ముఖ్య కార్యవర్గ సమావేశం నగరంలోని ఓ ప్రయివేటు పంక్షన్‌ హాల్లో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి కేసుల సత్వర పరిష్కారం కొరకు జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులను గౌర విస్తూ ఎపిలో 2014లో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరిచే విధంగా పోలీసు వ్యవస్థలో ప్రత్యేకంగా ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక డిఎస్‌పిలను నియమించారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సెల్‌ వల్ల బాధితులకు విచారణ సమయంలో రక్షణ, ముద్దా యిలను అరెస్టు చూపడం, ఛార్జిషీట్‌ దాఖలు చేయడం వల్ల సత్వర న్యాయం జరగడం వల్ల బాధిత వర్గాలకు ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఎన్నికల ముందే 2024లో 98 మంది ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ డిఎస్‌పిలను రద్దు చేసి, బాధిత వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. దీని ప్రభావం జనరల్‌ కేసులను విచారించే డిఎస్‌పిలపై పడడంతో ఎస్‌సి, ఎస్‌టి కేసుల ప్రాధాన్యత తగ్గడంతో పాటు విచారణ జాప్యం అవ్వడంతో చాలా కేసులు పెండింగ్‌లో పడ్డాయన్నారు. దీని వల్ల ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ఉద్దేశం నీరు గారిపోవడంతో, బాధిత వర్గాలైన ఎస్‌సి, ఎస్‌టి సమాజం ఎంతో నష్టపోతుందని వాపోయారు. సత్వరమే ఎస్‌సి, ఎస్‌టి సెల్లో డిఎస్‌పిలకు పోస్టింగ్‌లు ఇచ్చి నియమిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న రాష్ట్ర రాజధాని విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాధర్నా కార్యక్ర మానికి ఎస్‌సి, ఎస్‌టి ప్రజాసంఘాలు, అంబేద్కర్‌ వాదులు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం చలో విజయవాడ మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. సమావే శంలో బహుజనసేన వ్యవస్థాపక నాయకులు పి.జయశంకర్‌, శ్రీరా ములు, లక్ష్మీనారాయణ, రాఘవేంద్ర యాదవ్‌, హరి, లారా, నూర్‌ ఆలాం, నాయకులు రూపక్‌ నాయక్‌, మేరీ, లక్ష్మి, జెన్నీత్‌, షాలేం పాల్గొన్నారు.

➡️