ప్రజాశక్తి – సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లాలో గల రెండు వైటిసిల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సంక్రాంతి పండుగకు కూడా జీతాలు మంజూరు కాలేదు. దీంతో వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వారితో పని చేయించుకుంటూ ఏళ్లతరబడి జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో గల వైటిసిల్లో సుమారు పది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే లక్ష్యంతో గతంలో టిడిపి ప్రభుత్వమే యూత్ ట్రయినింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో ఇదే ప్రభుత్వ హయాంలో గిరిజన యువతీయువకులకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక్క శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. మూడేళ్లుగా జీతాలు మంజూరు కాకపోయినా సిబ్బంది ఆశతో పని చేస్తున్నారు. వైటిసిలను ఏర్పాటు చేసిన టిడిపి ప్రభుత్వంపై గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ఐటిడిఎ పరిధిలో ఉన్న వైటిసి సిబ్బందికి జీతాలు మంజూరు కాకపోవడంపై వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అన్ని శాఖల చిరుద్యోగులకు జీతాలు మంజూరు చేసిన ఐటిడిఎ అధికారులు వైటిసిల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మూడేళ్లుగా మంజూరు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు వారు జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి వినతిపత్రాలు అందజేశారు. అదిగో ఇదిగో అంటూ ఐటిడిఎ అధికారులు కాలయాపన చేయడం తప్ప జీతాలు మంజూరుకు కృషి చేయడంలేదు. కనీసం పండుగ పూట ఒక నెలైనా జీతం మంజూరు చేయకపోవడం వారి కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొంది.