ప్రజాశక్తి – బద్వేలు రెజ్లర్ వినేష్ ఫాగట్ అనర్హత వేటుపై అంతర్యం బయట పెట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్యారిస్‌లో జరుగుతున్న ఒలంపిక్స్ ఉత్సవాల్లో రెజ్లర్ వినేష్ పోగాట్ ఫైనల్‌కు చేరుకుందని అన్నారు. బుధవారం రోజు రాత్రి ఫైనల్ ఆడాల్సిన వినేష్ పోగట్‌పై దేశ ప్రజల గుండె పగిలేలా అనర్హత వేటు ప్రకటించిందన్నారు. అనర్హత వేటుపై సరైన సమాధానాలు చెప్పకుండా కాకమ్మ కథలు చెబుతున్నారని విమర్శించారు. ఏదైనా క్రీడలో పాల్గొనక ముందే అన్ని విధానాలుగా విచారణ చేసిన తర్వాతే ప్రవేశం కల్పిస్తారని అన్నారు. అలా విచారణ చేసి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించి ఫైనల్స్‌లో ఆడాల్సిన సమయంలో ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నారనే సాకుతో అనర్హత వేటు వేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలియజేశారు. గత సంవత్సరం రెజ్లర్ ఫెడరేషన్ అధ్యక్షులు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని గమనంలో పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు సాధించారా అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వానికి వారు నియమించిన శాఖలకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారికి ఇదే గతి పడుతుందని చెప్పడానికి చేసిన పనేనా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీకి నిజంగా దేశ క్రీడాకారులపై ప్రేమ ఉంటే అంతర్జాతీయ రెజ్లర్ల కమిటీ ఒలంపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. భారత క్రీడాకారులపై రాజకీయ కక్ష సాధింపులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దేశ ప్రజలందరూ వినేష్ పోగట్‌కు అండగా నిలబడాలని మీకు మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన సందర్భమని దేశ ప్రజలందరూ స్పందించాలని పిలుపునిచ్చారు. అవినీతి అక్రమాల క్రీడా శాఖపై సమగ్ర విచారణ చేపట్టాలని రెజ్లర్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులపై దర్యాప్తు చేపట్టాలని వినేష్ పోగాట్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు యు ఆంజనేయులు సహాయ కార్యదర్శి ఇమ్మానియేలు పాల్గొన్నారు.
