ఇళ్ల దగ్గర కూర్చొని ఇ-క్రాప్‌ లెక్కలు

Nov 28,2024 20:16

పత్తికి బదులు వరి నమోదు

వరి స్థానంలో మొక్కజొన్నగా రికార్డు

ఎలిజిబిలిటీ సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్న సిసిఐ

వ్యవసాయ శాఖ నిర్వాకంతో నిండా మునిగిపోయిన రైతులు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఇళ్ల వద్ద, రైతు సేవా కేంద్రాల్లో కూర్చొని ఇ-క్రాప్‌ నమోదు చేసేశారు. కొంతమంది వారి పరిధిలోని గ్రామాల నాయకుల ఇళ్ల వద్ద లేదా వారు సూచించిన రచ్చబండ వద్ద కూర్చొని ఇకెవైసి చేశారు. పాపం… ఆ అమాయక రైతులు అంతటితో తాము సాగుచేసిన పంటలకు ఇ-క్రాప్‌ అయిపోయినట్టేనని నమ్మేశారు. కాదు.. కాదు… వ్యవసాయ శాఖ సిబ్బందే అలా నమ్మించేశారు. తీరా పంట విక్రయానికి సిద్ధపడేసరికి అసలు రంగు బయట పడుతోంది. తీరా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లేసరికి అసలు పంట సాగులో ఉన్నట్టుగా కనిపించకపోవడంతో దళారుల వలలో పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, నువ్వులు పంటలకు బీమా సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఇ-క్రాప్‌ నమోదు మొదలవ్వకముందే నువ్వు పంట పూర్తయిపోయింది. దీని సంగతి కాస్త పక్కనబెడితే మిగతా నాలుగు పంటలు కలుపుకుని 98శాతం ఇ-క్రాప్‌ నమోదు అయినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 1,99,043 మంది రైతులు వరి 2,40,641 ఎకరాలు, మొక్కజొన్న 17,697 ఎకరాలు, పత్తి 4,137 ఎకరాలు, వేరు శనగ 11,118 ఎకరాల్లో సాగు చేశారు. వీటిలో వరి 98శాతం, మొక్కజొన్న 96శాతం, పత్తి 98శాతం, వేరుశనగ 95శాతం చొప్పున ఇ-క్రాప్‌ నమోదు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఒకే ఒక్క పత్తి కొనుగోలు కేంద్రం రామభద్రపురం మండలం ముడ్చర్లవలసలో ఏర్పాటు చేశారు. అది కూడా ప్రత్యేకంగా ఏర్పటు చేసింది కాదు. పత్తి జన్నింగ్‌ మిల్లునే కొనుగోలు కేంద్రంగా నామకరణ చేశారు. రైతులు ఎంత దూరమైనా ప్రభుత్వ ధరకు విక్రయించాలంటే అక్కడికే తీసుకెళ్లాలి. రవాణా ఛార్జీలు, ఇతర సమస్యల కారణంగా సగానికి సగం మంది రైతులు తమ ఊళ్లకు వచ్చిన వ్యాపారుల ఉచ్చులో పడక తప్పడం లేదు. ఎంతోకొంత మిగలకపోతుందా అన్న ఆశతో కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతులు మరింత నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మిల్లులో తొలుత ఎలిజిబిటి చూస్తున్నారు. అంటే ఆయన పేరున ఉన్న భూమిలో ఈ ఏడాది పత్తి సాగయ్యిందా? లేదా? అని. పత్తికి బదులు వరి లేదా ఇతర పంటలు నమోదైనట్టు ఉంటే, సిసిఐ సిబ్బంది కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో ఇ-క్రాప్‌ నమోదు చేసిన వ్యవసాయ శాఖ అస్టింటెంట్లు (రైతు సేవా కేంద్రాలు)ను సంప్రదిస్తే మీరు వరి కదా వేశారు అంటూ బుకాయిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘మీరు మాకు చెప్పాలి కదా? అంటూ రైతులపై ఎదురుడాడికి దిగుతున్నారు. దీంతో, చేసేదేం లేక ఆ కొనుగోలు కేంద్రానికి దగ్గర్లోనే ఉన్న ప్రైవేటు వ్యాపారులకు రూ.6,100 నుంచి రూ.6,200కు పత్తిని ఇచ్చేయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. దీనికితోడు అంతదూరం తీసుకెళ్లిన వాహనానికి అద్దె అదనపు నష్టంగా భరించాల్సివస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి క్వింటా పత్తి రూ.7,521గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈలెక్కన ప్రతి రైతు దాదాపు క్వింటాపై రూ.1200 నుంచి రూ.1300 వరకు నష్టపోతున్నారు. విజయనగరం జిల్లాలో 4,685 మంది రైతులు 4,137 ఎకరాల్లో పత్తి వేశారు. ఎకరాకు తక్కువలో తక్కువ 5 నుంచి 6 క్వింటాలు వరకు దిగుబడి వస్తుంది. ఈలెక్కన 20,685 నుంచి 25వేల క్వింటాళ్ల వరకు ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. దీన్నిబట్టి ఇ-క్రాప్‌ తప్పుడు నమోదు కారణంగా సిసిఐ కేంద్రంలో విక్రయాలకు అర్హత కోల్పోయిన రైతులెందరో? దళారుల వల నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో వేరేగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి తప్పుడు నమోదు వల్ల పంట నష్టం జరిగినా బీమా కూడా వర్తించే పరిస్థితి ఉండదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వాస్తవానికి రైతుసేవా కేంద్రాల్లోని అగ్రి కల్చర్‌ అసిస్టెంట్‌ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి అక్కడ వాస్తవంగా ఉన్న పంటను నమోదు చేయాలి. దీనికి ఆ పంట, సంబంధిత రైతు ఫోటోలను వివరాలకు ట్యాగ్‌ చేయాలి. కానీ, సరిగా జరగలేదు. ఇళ్లు, ఆఫీసుల్లో కూర్చొని పాత డేటా ఆధారంగా కొత్తగా నమోదు చేసేశారు. కొందరు గ్రామాల్లోని నాయకులను సంప్రదించి పోర్టర్‌లో రికార్డు చేశారు. ఇ-క్రాప్‌ నమోదు, ఇకెవైసిలకు ప్రభుత్వం నాలుగు దఫాలుగా గడువు ఇచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇలా మారుతున్న గడువు తేదీలను క్షేత్ర స్థాయి సిబ్బందికి పంపడం తప్ప, వారంతా క్షేత్ర స్థాయికి వెళ్లి నమోదు చేస్తున్నారా? లేదా? అన్నది మచ్చుకు కూడా పరిశీలించినట్టుగా కనిపించలేదు. మొదట మందకొడిగా సాగిన ఇ-క్రాప్‌, ఇకెవైసి చివరిలో ఒకేసారి ఇకెవైసి శాతం అమాంతంగా పెరిగిపోయినట్టు లెక్కలు చూపడంపై కూడా జిల్లా అధికారి అనుమానించలేదు. అటు క్షేత్ర స్థాయి సిబ్బంది తమకు పని భారం ఎక్కువై పోయిందంటూ తప్పించుకుంటున్నారు. ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలోనూ నాలుగైదు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, కాబట్టి పొలాలకు వెళ్లడం సాధ్యం కాలేదని తేలిపోతున్నారు.  దీన్నిబట్టి వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉదాసీనత ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.

➡️