ప్రతి దరఖాస్తునూ పరిష్కరించాల్సిందే

Mar 10,2025 21:17

 ప్రజాశక్తి-విజయనగరంకోట/టౌన్‌ :  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి దరఖాస్తునూ పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్‌ సమీక్షిస్తూ వినతులపై తప్పుగా ఎండార్స్‌మెంట్‌ ఇచ్చి పరిష్కరించినట్లుగా పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా మన్నారు. జిల్లాలోని రెవిన్యూ అంశాల పరిష్కారంలో తహశీల్దార్లు సంతృప్తికరంగా పనిచేయాలన్నారు. ఆర్ధిక అంశాలతో ముడిపడి వున్నవి, కోర్టు కేసులతో ముడిపడి వున్న సమస్యలు మినహా ఇతర వినతులన్నీ పరిష్కరించాల్సిందేని కలెక్టర్‌ చెప్పారు. పిజిఆర్‌ఎస్‌కు పోటెత్తిన వినతులుప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, ఇన్‌ఛార్జి జెసి ఎస్‌.శ్రీనివాసమూర్తి, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి మురళి వినతులను స్వీకరించారు. ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 173, పంచాయతీ శాఖకు సంబంధించి 15, డిఆర్‌డిఎకి సంబంధించి 11, మున్సిపాల్టీలకు 10, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించి వచ్చాయి. విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్‌ హేండ్స్‌ హిజ్రాస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఆదర్శ వివాహం చేసుకున్న రెండు వికలాంగుల జంటలను ఇన్‌ఛార్జి జెసి ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆశీర్వదించారు.

ఆండ్ర ఎడమ కాలువలో పూడిక తీత చేపట్టాలి

విజయనగరం టౌన్‌ : ఆండ్ర ప్రాజెక్టు ఎడమ కాలువ పూడిక తీత,కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి చివరి ఆయకట్టు దారులకు సాగునీరు అందించేం దుకు చర్యలు తీసుకోవాలని రైతుసంఘం నాయకులు డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాస్‌, రైతులు వినతి అందజేశారు. ప్రాజెక్టు శివారు ఆయకట్టు గ్రామాల భూములకు సాగునీరు చేరేవిధంగా తగు చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎడమ కాలువ రైతు నాయకులు కర్రీ బంగారు నాయుడు, మంత్రి సూర్యం, బుగత సత్తిబాబు తదితరులు అందజేశారు.

చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్‌ ను ఇప్పించండి

ఇంగ్లీష్‌ అధ్యాపకుడిగా, ఎపి ఆర్‌జెసి ప్రిన్సిపల్‌ గా విధులు నిర్వహించి రిటైర్డు అయిన తనకు చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్‌ ఇప్పించి నాకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను బాధిత అధ్యాపకుడు పుల్లయ్య పూజారి కోరారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన తాను గత ఏడాది ఫిబ్రవరి 20న ఉద్యోగ విరమణ చేశానని, నేటివరకు తనకు పెన్షన్‌ మంజూరు కాలేదని ఆవేదన చెందారు. ప్రస్తుత తాటిపూడి ఎపిఆర్‌జెసి ప్రిన్సిపాల్‌ డిపివి ఆర్‌ లక్ష్మి అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇప్పటికే విద్యాశాఖామంత్రికి, ఎపిఆర్‌ఇ సొసైటీ కార్యదర్శికి, ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకొని, తనకు పెన్షన్‌ ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

➡️