ముందస్తుగా వదర సహాయక చర్యలు చేపట్టాలి

తహశీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు

తహశీల్దారుకు సిపిఎం వినతి

ప్రజాశక్తి-కూనవరం

రానున్న వరదల సమయంలో ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా వరద సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మండల తహశీల్దారుకు సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల వరదలకు ప్రతి ఏటా ఇబ్బంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాదైనా ముందస్తుగా ప్రతి సచివాలయ పరిధిలో బియ్యం, కిరోసిన్‌ వంటి నిత్యావసరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కోతులగుట్ట నుండి, ఏడుగురాళ్లపల్లి మీదుగా రోడ్డును పునరుద్ధరించాలన్నారు. గత కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినా నిధులు మంజూరు చేసినా ఇప్పటికి వరకు రోడ్డు సరిగా చేయలేదన్నారు. మళ్ళీ గోదారి వస్తే భద్రాచలం వెళ్ళడానికి అదే ఏకైక రహదారి అని, కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. గత ఏడాది తార్పాలిన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్ముతున్నా కట్టడి చేయలేదని పేర్కొన్నారు. దీనికి స్పందించిన తహసీల్దార్‌ వెంకట మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ విషయమై పై అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని. ఎటువంటి ఇబ్బంది కలగకుండా వరద బాధితులకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గామాలలో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకుంటామని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి సాయం సీతారామయ్య, సిపిఎం ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

➡️