ఇసుక అక్రమ డ్రెడ్జింగ్‌ ఆపాలి : సిపిఎం

Apr 2,2024 22:20
ఇసుక అక్రమ డ్రెడ్జింగ్‌ ఆపాలి : సిపిఎం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంగోదావరి నదిలో సాగిస్తున్న ఇసుక అక్రమ డ్రెడ్జింగ్‌ను వెంటనే ఆపాలని, గోదావరి ఒడ్డున ఉన్న వారికి తాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు. శ్యామల సెంటర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి ఎండలు పెరుగుతున్న సమయంలో ప్రజలు ఎదురుకుంటున్న తాగునీటి సమస్యను పాలకులు పరిష్కరించలేదన్నారు. నగరంలో లూథర్‌ గిరి, వాంబే కాలనీ, గాదిరెడ్డి నగర్‌, ఆనంద్‌ నగర్‌, తారకరామ నగర్‌, పద్మావతి నగర ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు, వెంకటనగరం గ్రామాల్లో నిరంతరం నీటి సమస్య ఉందన్నారు. పాలక మండలి లేకపోవడంతో అధికారుల ప్రతేక పాలనలో మరిన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. గోదావరికి అటువైపు ఉన్న కోవ్వూరులో నేటికీ వేసవి వచ్చిందంటే మంచి నీటి ఎద్దడి ఉందన్నారు. నగరంలో రూ.కోట్ల కార్పొరేషన్‌ సాధారణ నిధులను సుందరీకరణ పేరుతో రాళ్ళ పాలు చేశారు తప్ప మంచినీటి సరఫరాపై ఖర్చు చేయాలనే తలంపు లేకపోవడం దురదష్టకరం అన్నారు. గోదావరి నదిలో చేస్తున్న ఇసుక అక్రమ డ్రెడ్జింగ్‌ వల్ల భూగర్భ జలాలు అడుగటుతున్నాయని అన్నారు. అనేక రేవుల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్న అధికారులకు పట్టడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి బి.పవన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.రాజులోవ, ఎం.సుందర్‌ బాబు, ఎస్‌ఎస్‌.మూర్తి పాల్గొన్నారు.

➡️