జనసేనలో ముసలం

Feb 26,2024 23:28
టిడిపి, జనసేన

జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కు మొండిచేయి
నేడు కడియం నుంచి రాజమహేంద్రవరం దేవీచౌక్‌ వరకూ జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిది
జనసేన పార్టీలో ముసలం మొదలైంది. జిల్లాలో రూరల్‌ స్థానంపై అధినేత నిర్ణయం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. రాజమహేంద్రవరం రూరల్‌ స్థానంలో పోటీపై టిడిపి, జనసేన నేతలు ఎవరికి వారే దీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ శ్రేణుల అంచనాలను జనసేనాని పవన్‌కళ్యాణ్‌ తలకిందులు చేశారు. కందుల దుర్గేష్‌ నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే నిడదవోలు నియోజక వర్గంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అక్కడి మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు జనసేనకు సహకరించేది లేదని చెబుతూ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. దీంతో రాజమహేంద్రవరంలో జనసైనికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జై జనసేన, జై కందుల పేరుతో నేడు కడియం నుంచి దేవీచౌక్‌ వరకూ ర్యాలీ చేపట్టనున్నారు. ఇరుపార్టీల అధినేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.తొలి జాబితాలో ఒక్కరికే చోటుటిడిపి, జనసేన కూటమి ఇటీవల తొలి జాబితాను విడుదల చేసిన విషయం విధితమే. జాబితాలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ప్రకటించారు. ఈ మూడింటిలో రాజానగరం సీటును జనసేనకు అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేరును ఖరారు చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నలమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసులను బరిలో నిలపనున్నట్లు తెలిపారు. తాజాగా రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం మాజీ ఎంఎల్‌ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారని, జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కు జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. నిడదవోలు నుంచి పోటీ చేయాలని సూచించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా కందుల దుర్గేష్‌ రాజమహేంద్రవరం రూరల్‌ స్థానంపై కేంద్రీకరించారు. అధినేత నిర్ణయంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పునరాలోచిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.పట్టు వదలని ఎంఎల్‌ఎ గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి వరుసగా రెండు ఎన్నికల్లో రూరల్‌ స్థానం నుంచి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మరోసారి గెలిస్తే మూడో సారి హాట్రిక్‌ నమోదు చేసే అవకాశం ఉంది. జనసేన- టిడిపి పొత్తు ప్రకటించినప్పటి నుంచి రూరల్‌ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే కందుల దుర్గేష్‌ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కావడంతో తప్పనిసరిగా సీటు ఖరారు చేస్తారనే నమ్మకం జనసేన శ్రేణుల్లో ఉండేది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్‌ బరిలో తానే నిలబడతానని దీమా వ్యక్తం చేశారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పర్యటన అనంతరం రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం తనదేనని కందుల దుర్గేష్‌ ప్రకటించిన రోజే తానూ మరో ప్రకటన చేశారు. రూరల్‌ స్థానం టిడిపిదేనని కార్యకర్తలు ఆందోళన చెందొద్దంటూ స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో ఏ పార్టీకి ఇచ్చినా పరస్పర సహకారంపై నీలి నీడలు కమ్ముతున్నాయి. అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

➡️