నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్‌పి

Feb 11,2024 22:41
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులు ఎన్నికల నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలని ఎస్‌పి జగదీష్‌ ఆదేశించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అండ్‌ ఎలక్షన్స్‌ ప్రాసెస్‌- 2024ను ఆదివారం జెఎన్‌ రోడ్డులోని ఐఎంఎ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు వారి పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల నియమాలపై సమావేశాలను నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ పెద్దలతో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను బలోపేతం చేయాలన్నారు. గంజాయి, సారా, మద్యం, నగదు ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఫస్ట్‌ ఎడిజె కోర్టు పిపి జివిఎస్‌.ప్రసాదరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏఏ కేసులు ఎలా నమోదు చేయాలని, వాటిని కోర్టులో ఎలా పొందుపరచాలి, ఎన్నికల నియమావళి అనుసరించి పోలీసు అధికారులు నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. పిపిటి ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల నిబంధనలను వివరించారు. ప్రజాస్వామ్యయుతంగా పౌరులు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలను అడ్డుకో వాలన్నారు. ఎన్నికల సామగ్రికి రక్షణ కల్పించాలన్నారు. ర్యాలీలు, నిరసనల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎన్నికల అధికారులకు సాయం అందించాలన్నారు. తటస్థంగా ఉండి సేవలందించాలన్నారు. లైసెన్స్‌ లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సీజ్‌ చేయాలన్నారు. లైసెన్స్‌డ్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయించాలన్నారు. రౌడీ షీటర్లు, పరారైన వారిపై నిఘా పెంచాలన్నారు. క్రిమినల్‌ కేసుల్లో నిందితులు, షీటర్లను గుర్తించాలన్నారు. గత నేరస్తులను బైండోవర్‌ చేయాలన్నారు. చట్టవిరుద్ధమైన డబ్బు, సామగ్రిని స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. ఈ వర్కుషాపులో డిఎస్‌పిలు, సిఐలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎలక్షన్‌ సెల్‌ సిబ్బంది, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️