నేడు గోదావరి బాలోత్సవం

Feb 9,2024 23:17

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
పిల్లల పండుగ గోదావరి బాలోత్సవం శనివారం ప్రారంభం కానుంది. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అదే స్ఫూర్తితో ఈ ఏడాది 2వ పిల్లల పండుగకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. చిన్నారుల్లో సృజనాత్మకత, మానసిక, శారీరక ఉల్లాసం పెంపొందించడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ బాలోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో సుమారు ఆరు వేల మందికిపైగా చిన్నారులు ఇప్పటికే పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మరో నాలుగు వేల మందితో మొత్తంగా 10 వేల మంది చిన్నారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ఇలా….ఉదయం 10 గంటలకు బాలోత్సవం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు వివిధ రకాల పోటీలు జరుగుతాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నారు. 3.30 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది.32 అంశాలలో సుమారు 60 పోటీలు 32 అంశాల్లో సుమారు 60 సాంస్కృతిక, విద్య, విజ్ఞాన విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ చుదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. సబ్‌ జూనియర్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. మట్టి బొమ్మల తయారీ, కార్టూన్‌లు గీయడం, దినపత్రిక చదవడం, అంతర్జాలంలో అన్వేషణ, పద్యం -భావం క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం, కోలాటం, జానపద నృత్యం, సంప్రదాయ నృత్యం, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్‌, విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయం, దేశభకి,్త గీతాలాపన, లఘు నాటికలు, తెలుగులో మాట్లాడటం, కథలు చెప్పడం, జ్ఞాపక శక్తి పరీక్ష తదితర అంశాల్లో పోటీలు జరుగనున్నాయి.

➡️