పలుచోట్ల ఘనంగా ఈస్టర్‌ పండుగ

Mar 31,2024 22:03
పలుచోట్ల ఘనంగా ఈస్టర్‌ పండుగ

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్‌ పండుగను ఆదివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైసిపి సిటీ ఎంఎల్‌ఎ అభ్యర్థి మార్గాని భరత్‌ రామ్‌ నగరంలోని 30వ వార్డు చర్చ్‌ పేట వద్ద సెయింట్‌ పాల్స్‌ చర్చ్‌, గోకవరం బస్టాండు వద్దనున్న హోలీ ట్రినిటీ చర్చ్‌, 1వ వార్డు లాలా చెరువు వద్దగల హోసన్నా చర్చ్‌, రాజా థియేటర్‌ వద్దగల బ్రదరన్‌ చర్చ్‌లో నిర్వహించిన ఈస్టర్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎవి అప్పారావు రోడ్డులోని ప్రతాప్‌ సిన్హా చర్చ్‌లో ఎంపీ భరత్‌, ఆయన సతీమణి మోనా ఈస్టర్‌ వేడుకలో పాల్గొన్నారు. ఏసు ప్రభువులో ఉన్న ప్రేమ, కరుణ, మానవత్వం, దయ, త్యాగం ఎంతో ఉన్నతమైనవి అన్నారు. ఈ సద్గుణాలతోనే మానవులలో పరివర్తనకు ఏసు ఎంతగానో ప్రయత్నించారన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలని ఎంపీ భరత్‌ సూచించారు. ఏసు చూపిన మార్గంలో నడవడం ద్వారా లోక కల్యాణం సాధ్యమవుతుందన్నారు. తాళ్లపూడి క్రైస్తవులకు పవిత్రమైన ఈస్టర్‌ పండగ సందడి మండలంలోని అనేక గ్రామాల్లో నెలకొంది. క్రైస్తవులంతా తమ పూర్వీకులను స్మరించుకుంటూ సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఈ సందడి నెలకొనగా ప్రార్థనల అనంతరం పలుచోట్ల తీపి వంటకాలను భక్తులకు పంచిపెట్టారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ కుటుంబ సభ్యులతో కలిసి వేగేశ్వరపురంలోని మేరీ మాతను దర్శించుకున్నారు. డైరెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ టి.జాన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జవహర్‌ వెంట ఎం.వెంకట్రావు, కె.పోసియ్య, పి.శ్రీనివాస్‌, ఎం.వెంకటరత్నం, సిహెచ్‌.బంగారుబాబు, కె.నరసయ్య పాల్గొన్నారు. గోపాలపురం మండలంలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం లూథరన్‌ దేవాలయం పాస్టర్‌ రెవరెండ్‌ ముప్పిడి రాజీవ్‌ గాంధీ, బత్తిన ప్రవీణ్‌ కుమార్‌ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలలో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని క్రైస్తవ మందిరాలలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.

➡️