పేపర్‌మిల్లు కార్మికుల మెరుపు సమ్మె

Apr 2,2024 22:19
పేపర్‌మిల్లు కార్మికుల మెరుపు సమ్మె

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధిరాజమండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్‌ కార్మికులు మంగళవారం మధ్యాహ్నాం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. వేతన ఒప్పందం కాల పరిమితి పూర్తయ్యి నాలుగేళ్లు అయినా నూతన వేతన ఒప్పందం చేయ కుండా యాజమాన్యం మొండిగా వ్యవహరించడానికి నిరసనగా బి షిఫ్ట్‌లో ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు మిల్లు లోపల బైటాయించారు. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌ 30తో ముగిసిపోయింది. అప్పటి నుంచి నూతన వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. చట్ట బద్దంగా అనేక పద్ధతుల్లో పోరాడినా ఎలాంటి స్పందన లేదు. దీంతో నెల రోజుల క్రితం మిల్‌లో ఉన్న 11 రిజిస్టర్డ్‌ కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. ఆ తరువాత ఏలూరు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ వద్ద యాజమాన్యం, కార్మిక సంఘాల జాయింట్‌ మీటింగ్‌లో జరిగింది. కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యం చేసిన సూచన మేరకు 11 సంఘాలు ఉమ్మడిగా వేతన ఒప్పందానికి సంబంధించిన డిమాండ్స్‌ అందించాయి. కాని యాజమాన్యం చర్చలకు పిలిచి వేతన ఒప్పందం చేయలేమని మొండిగా వ్యవహరించింది. దీంతో యూనియన్‌ నాయకులు మళ్లీ కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించారు. వేతన ఒప్పంద చేయాలని కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ యాజమాన్యానికి సూచించారు. ఆ సూచనలనూ యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో గత్యంతరం లేక కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. వారికి బయట నుంచి కార్మికులు, నాయకులు మద్దతు తెలిపారు.

➡️