ప్రతి ధాన్యపు గింజకూ మద్దతు ధర

Apr 2,2024 22:28
ప్రతి ధాన్యపు గింజకూ మద్దతు ధర

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకూ మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం కాపవరంలో జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాత్సవ్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 229 ఆర్‌బిజె కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులను ముందుగానే ఆర్‌బికెల్లో ఉంచి రైతు నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేశామన్నారు. ఈ రబీలో కూడా సీజన్‌కు సంబంధించి ఈ క్రాప్‌ బుకింగ్‌ ఇప్పటికే పూర్తయినందున, అధికారులు అప్రమత్తతో 229 ఆర్‌బికె కేంద్రాల్లో ముందుగానే గన్నీ బ్యాగులను ఉంచుకుని రైతు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతాన్ని పరిశీలించి మిల్లర్లకు పంపించాలని ఆదేశించారు. హార్వెస్టింగ్‌కు వారం రోజులు ముందుగానే షెడ్యూల్‌ నిర్ణయించి, హమాలీలను ఏర్పాటు చేసి, వాహనాలకు సంబంధించి జియో టాగింగ్‌ పూర్తి చేయాలన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నూరు శాతం ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. మిల్లర్స్‌ ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టకుండా తేమ శాతాన్ని బట్టి సకాలంలో ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల ప్రక్రియ, షెడ్యుల్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. రైతు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన సకాలంలో సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డిఒ, తహశీల్దారు కార్యాలయాల్లో ఫోన్‌ నెంబర్లు సహా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 229 కోనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల 20 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డిఎం టి.రాధిక తదితరులు పాల్గొన్నారు.

➡️