మారనున్న రైల్వే స్టేషన్‌ రూపురేఖలు

Feb 26,2024 23:32
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌

మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్‌రామ్‌
అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. సోమవారం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, మంత్రిలతో పాటూ అధికారులు హాజరయ్యారు. రూ.270 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. ఈ సందర్బంగా మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు 172 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధిని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ రైల్వే అభివృద్ధికి సంబంధించిన పలుమార్లు ప్రతిపాద నలను కేంద్ర రైల్వే శాఖ మంత్రికి పంపించామన్నారు. అంతేకాకుండా ఆయన్ని స్వయంగా కలిసి వివరించామన్నారు. ఈ ప్రతిపాదనలకు స్పందించి అమృత భారత్‌ స్టేషను పథకంలో భాగంగా రూ.270 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ రైల్వే స్టేషన్‌గా మారబోతోందన్నారు. భవిష్యత్తులో వేగవంతమైన వందే భారత్‌ వంటి రైళ్లు అనేకం రానున్న దృష్ట్యా గోదావరి నదిపై మరో కొత్త వంతెనకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశానని తెలిపారు. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉందన్నారు. కొవ్వూరు – భద్రాచలానికి కొత్త లైన్‌ పడుతోందని, విశాఖ – విజయవాడ థర్డ్‌ లైన్‌ వేస్తున్నారని ఎంపీ తెలిపారు. రైల్వే స్టేషను రోడ్డు వెడల్పు చేయాల్సి ఉందని, ఇందుకు గాను విఎల్‌.పురం వద్ద 4వేల గజాల స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి సోము వీర్రాజు, ఎడిఆర్‌ ఎమ్‌డి శ్రీనివాసరావు, ప్రోగ్రాం ఇన్‌ఛార్జి డి.ప్రసాద్‌ తదితతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వికసిత్‌ భారత్‌, వికసిత్‌ అమృత్‌ అంశంపై వ్యాచరచన, డ్రాయింగ్‌, వ్యాయామ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.

➡️