వచ్చే ఎన్నికల్లో వైసిపి గల్లంతే

Feb 11,2024 22:42
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసిపి గల్లంతు కావడం ఖాయమని టిడిపి నేతలు స్పష్టం చేశారు. స్థానిక ఆనంద్‌ రీజెన్సీలో ఆదివారం టిడిపి అనుబంధ తెలుగు యువత రాష్ట్ర విభాగం, రాజమహేం ద్రవరం పార్లమెంట్‌ తెలుగు యువత, నగర కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి తెలంగాణా రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ తనదైన చమత్కార ధోరణిలో జగన్‌ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి అందరినీ ఉర్రూతలూగించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సారధ్యంలో రాజమహేంద్రవరం నగరం పసుపు మయమైందన్నారు. రాజమహేంత్రదవరం గడ్డ ఆదిరెడ్డి అడ్డా అనేందుకు ఇదే తార్కాణమన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, రాజమహేం ద్రవరంలో ఆదిరెడ్డి విజయం తధ్యమన్నారు. ఇటీవల జగన్‌ ప్రకటించింది మెగా డిఎస్‌సి కాదని, దగా డిఎస్‌సి అని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విజయం వైపు టిడిపి, జనసేన కూటమి అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టిడిపి నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, బుడ్డిగ రాధా, మజ్జి రాంబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై.శ్రీను, యాళ్ల ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీల ప్రమాణస్వీకారం చేశారు. తొలుత బైపాస్‌ రోడ్డులోని నక్కా దేవీవరప్రసాద్‌ కార్యాలయం దగ్గర నుంచి భారీ ర్యాలీగా యువకులు ఆనంద్‌ రీజెన్సీకి చేరుకున్నారు.

➡️