సర్వ మతాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తా

Apr 2,2024 22:35
సర్వ మతాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తా.

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం, యు.కొత్తపల్లి రాజకీయ పార్టీ అధినేతగా సర్వ మతాలు, సర్వ ధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. నాలుగో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం పిఠాపురం పట్టణంలోని చారిత్రక ఆంధ్ర బాప్టిస్ట్‌ సెంటినరీ చర్చిని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ‘తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు’ అన్న బైబిల్‌ సూక్తే తనకు దిక్సూచీ అన్నారు. పార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగెళ్ల ఉదరుశ్రీనివాస్‌, క్రైస్తవ మత పెద్దలు ఎలీషా బాబు, తమోఫిలిన్‌, గువ్వల సాల్మన్‌ రాజు పాల్గొన్నారు. అనంతరం యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్‌ బీబీ ఔలియా (బంగారు పాప) దర్గాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చందనం పూసి, వస్త్రం సమర్పించారు. తరువాత మహిళలు, రైతులు, కార్మికులు, యువత, ఆటో డ్రైవర్లు తదితరులను కలిసి మాట్లాడారు. అనుమతి లేక మహిళా సమావేశం వాయిదాయు.కొత్తపల్లిలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో మంగళవారం మధ్యాహ్నం తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని అధికారులు తెలియజేయడంతో పవన్‌ కళ్యాణ్‌ వారితో పూర్తిస్థాయిలో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఎటువంటి రాజకీయ ప్రసంగాలు లేకుండానే ఆయన పది నిమిషాలు ఉండి వెనుతిరిగారు. 48 గంటలకు ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసినా అధికారులు పర్మిషన్‌ ఇవ్వలేదని తెలిపారు. నియోజకర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

➡️