15 నాటికి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం

Feb 10,2024 22:24
15 నాటికి పెండింగ్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

ఈ నెల 15 నాటికి పెండింగ్‌ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శనివారం ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, తుది ఓటరు జాబితా అనంతరం ఫారం 6, 7, 8 లయొక్క ప్రస్తుత పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారి, మరియు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాధవీలత జిల్లాకి చెందిన వివరాలను ఆయనకు వివరించారు. ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ సమయంలో బిఎల్‌ఒలకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. నియోజక వర్గ స్ధాయిలో విధులు నిర్వర్తించే అధికారులకి, సిబ్బందికి శిక్షణ కోసం మాస్టర్‌ ట్రైనర్‌ల ద్వారా ఎన్నికల నిర్వహణ, సాంకేతిక పరమైన పరిజ్ఞానంపై అవగాహన కల్పించినట్లు వివరించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు సంబందించి 395 కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎన్నికల తేదీకి అనుగుణంగా చేపట్టవలసిన వివిధ బాధ్యతలపై రూట్‌ మ్యాప్‌ సిద్దం చేసి ఆమేరకు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రకటించిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఓటరు జాబితాలో ఫారం 6లు 1394 చేర్చినట్లు, ఫారం -7లు 635 తొలగించినట్లు, ఫారం -8లు చెంది మార్పులు, చేర్పులు 864 జరిగినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఫారంలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అమలు చేసేలా రిటర్నింగ్‌ అధికారులకు, ఎలెక్టోరల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇఆర్‌ఒ లాగిన్‌లో ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పోలింగ్‌ సిబ్బంది డేటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15 పూర్తి చేయనున్నట్లు మాధవీలత తెలిపారు. మైక్రో పరిశీలకులను సోమవారం నుంచి గుర్తించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గాల ఆర్‌ఒలు ఎన్‌.తేజ్‌ భరత్‌, కె.దినేష్‌కుమార్‌, అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, ఎ.చైత్రవర్షిణి, ఎం.మాధురి, కెఎల్‌.శివజ్యోతి, ఎం.మాధురి, ఆర్‌వి.రమణానాయక్‌ , డిఆర్‌ఒ జి. నరసిం హులు, పర్యాటక శాఖ ఆర్‌డి వి.స్వామీ నాయుడు, ఎస్‌డిసి ఎం.వెంకటసుధాకర్‌, ట్రైనీ డిప్యూటీ కలక్టర్లు పి.సువర్ణ, ఎం.భానుప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️