ప్రయాణికుల జేబులకు చిల్లు

Jan 9,2025 22:35
పండుగ రద్దీ

మూడింతలు అదనంగా ఛార్జీల వసూలు
ప్రయివేటు ట్రావెల్స్‌ అడ్డగోలు దోపిడీ
ఊరట నివ్వని ఆర్‌టిసి ‘స్పెషల్‌’
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
పండుగ రద్దీ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు యాజమాన్యాలు ప్రజల ప్రయాణ అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి ప్రకటించిన ‘స్పెషల్‌’ ప్రయాణికులకు ఊరటనివ్వలేదు. ఈ నెల 2వ తేదీ నాటికే రిజర్వేషన్స్‌ అయిపోయాయి. జిల్లాలోని రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు, గోకవరం బస్టాండ్‌ల నుంచి సాధారణంగా ప్రతిరోజూ ఉండే 11 సర్వీసులతో పాటు తాజాగా మరో 88 బస్సులను ఆర్‌టిసి యాజమాన్యం కేటాయించింది. అయితే ఈ బస్సులకు ఇప్పటికే వంద శాతం రిజర్వేషన్‌లు అయిపోవటంతో ప్రయాణికులు ప్రయివేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. ఉపాధి కోసం ఇతర పట్టణాల్లో స్థిరపడిన జిల్లా వాసులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వస్థలాలకు రావడం పరిపాటి. కుటుంబ సభ్యుల రాకతో ప్రతి ఇంటిలోనూ పండుగ సంబరాలు దర్శనమిస్తుంటాయి. ఇదే అదునుఆ ప్రయివేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 360 మంది ప్రయివేటు ఆపరేటర్లు ఉన్నారు. వివిధ సంస్థల తరుపున జిల్లాలో బస్సుల రిజర్వేషన్‌లు చేస్తుంటారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో వారం రోజులుగా ఒక్కసారిగా టికెట్టు ధరలు పెంచేశారు. ప్రస్తుతం హైద్రాబాద్‌ నుంచి ఇక్కడకు వచ్చే బస్సులకు నాలుగు రెట్లు అదనంగా వసూలు జరుగుతోంది. జిల్లా నుంచి హైద్రాబాద్‌ బుకింగ్‌కు రిజర్వేషన్లు జోరందుకున్నాయి. ఆర్‌టిసితో పోల్చితే ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో ప్రయాణికులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కాకినాడ నుంచి విజయవాడకి ఆర్‌టిసి ఛార్జి రూ.410 కాగా ప్రయివేటు బస్సులు రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విశాఖ పట్టణానికి ఆర్‌టిసి ఛార్జి రూ.360 కాగా ప్రయివేటు ట్రావెల్స్‌ రూ.1,800 వరకూ వసూలు చేస్తున్నారు.కాకినాడ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులకు రూ.2,500వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రయివేటు బస్సులకు రూ.3వేల వరకూ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి హైద్రాబాద్‌కు రూ.2100 చొప్పున టికెట్లు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క టికెట్లు ధరకు అదనంగా మూడు రెట్లు వసూలు జరగడంతో ఒక నలుగురు ఉన్న కుటుంబంపై రూ.7 వేలకు పైగా భారం పడటంతో సామాన్య ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుఊరటనివ్వని ఆర్‌టిసి ఎపిఎస్‌ ఆర్‌టిసి పండుగ నేపథ్యంలో స్పెషల్స్‌ పేరుతో ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. జిల్లాలోని నాలుగు ఆర్‌టిసి డిపోలకు ఈ నెల 10 తేదీ నుంచి 13వ తేదీ వరకూ వరకు హైదరాబాద్‌ నుంచి 88 సర్వీసులు అదనంగా కేటాయించింది. గోకవరం డిపో నుంచి 16 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, కొవ్వూరు డిపో నుంచి 13సూపర్‌ లగ్జరీ, 3 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, నిడదవోలు నుంచి 9 సూపర్‌ లగ్జరీ, రాజమండ్రి డిపో నుంచి 25 సూపర్‌ లగ్జరీ, 8 ఎక్స్‌ప్రెస్‌లు, 14 అల్ట్రా డీలక్స్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీ రీత్యా పరిమితులు కేటాయించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరిగి 16వ తేదీ నుంచి జిల్లా నుంచి హైదరాబాద్‌ ఇతర ముఖ్య పట్టణాలకు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు. గతంలో సాధారణ ఛార్జీలకు అదనంగా 50 శాతం వసూలు జరిగేది. గత కొన్నేళ్లుగా అదనపు ఛార్జీల వసూళ్లకు ఆర్‌టిసి యాజమాన్యం స్వస్థి పలికింది. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. అయితే పెరుగుతున్న రద్దీ రీత్యా మరిన్ని సర్వీసులు కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

➡️