ఉపాధి కూలీలపై అదనపు భారం

Apr 11,2025 22:50
ఉపాధి కూలీలపై అదనపు భారం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలపై పరికరాల కొనుగోలుకు అదనపు భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ అమల్లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఒక్కో కూలీపై రూ.350 నుంచి రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం కూలీల వేతనాలకు 60 శాతం, సామగ్రి విభాగం కింద 40 శాతం నిధులు వెచ్చించాలి. పరిపాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. సామగ్రి విభాగం, పరిపాలనకు వెచ్చించే నిధులు కింద పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే నాలుగేళ్లకు పైగా గ్రామీణాభివృద్ధి శాఖ పరికరాల కొనుగోలుకు అనుమతి ఇవ్వకపోవడంతో సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో కూలీలకు పార, పలుగు, తట్టలు, నీడ కోసం టెంట్లు, ప్రాథమిక చికిత్సకు కిట్లు సరఫరా చేసేవారు. కొంతకాలం తర్వాత తాగునీటికి రూ.5, గునపానికి రూ.5, తట్టకు రూ.3 చొప్పున చెల్లించారు. మేస్త్రికి పది మంది కూలీలను తీసుకొచ్చినందుకు రూ.3 చొప్పున రూ.30 చెల్లింపులు జరిగేవి. ఐదు కిలోమీటర్లు దాటితే 20 శాతం అదనంగా వేతనం చెల్లింపులు చేసింది. ఫిబ్రవరి నుంచి మే వరకూ 20 నుంచి 50 శాతం చొప్పున సమ్మర్‌ అలవెన్స్‌లను అందజేసేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొన్ని గ్రూపులకు పరదాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పని చేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తూ గాయపడితే ప్రథమ చికిత్సకు కనీస సామగ్రి కూడా అందుబాటులో లేదు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 1,00,247 కుటుంబాలలోని 1,32,954 మంది ఉపాథి హామీ కూలీలకు 51,88,790 పని దినాలు కల్పించారు. తద్వారా ఉపాథి హామీ కూలీలకు రూ. 131 కోట్ల మేర వేతనముల రూపంలో చెల్లించారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ఎస్‌సి కుటుంబాలకు 18.67 లక్షల పని దినాలు, ఎస్‌టి కుటుంబాలకు 1.02 లక్షల పని దినాలను కల్పించారు. వీరందరికీ పని దినాలు కల్పించడమే లక్ష్యంగా డ్వామా విభాగం లక్ష్యాలను పెట్టుకొని ఉపాధి హామీ పనులను చేయిస్తోంది. కానీ ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. ఉపాధి పథకంలో సామగ్రి విభాగం కింద సమకూరుతున్న నిధులను సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణాలకు వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సామగ్రి భారం తమపై పడుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️