అటకెక్కిన మత్య్సకార భరోసా

Apr 14,2025 22:32
మత్స్యకార భరోసా

నేటి నుంచి సముద్రంలో వేట నిషేధం
రెండు నెలల పాటు అమలు
రూ.20 వేల హామీ ఇచ్చిన సిఎం బాబు
భృతి కోసం గంగపుత్రుల ఎదురుచూపు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధివేట
నిషేధ సమయంలో మత్య్సకార భరోసా కింద అందించే రూ.10 వేల సాయాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.20 వేలకు పెంచి అందజేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీంతో అన్ని వర్గాలతో పాటు తీర ప్రాంత వాసులు సైతం నమ్మి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా సాయం మాట పక్కన పెట్టేశారు. కనీసం దానిపై స్పష్టమైన ప్రకటన కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడిస్తారని అధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారు. పాలకులైనా బదులిస్తారని ఆశిస్తే వారి నుంచి కూడా స్పందన కనిపించడం లేదు. దీంతో మత్య్సకార భరోసా పథకం అటకెక్కిందా అనే అనుమానాలు మత్య్సకారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 33,704 మంది లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. వారికి రూ.20 వేలు చొప్పున రావాల్సిన రూ.67.407 కోట్లు ఎప్పుడిస్తారనే దానిపై ఆశలను వదులుకున్నారు.
15 నుంచి వేట నిషేధంచే
పలు గుడ్లు పెట్టే దశలో మర, మోటారు బోట్లతో వేటాడితే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఏటా దేశవ్యాప్తంగా వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు 60 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. తెప్పలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో మర బోట్లన్నీ పలు తీరాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిషేధ సమయంలో మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోనున్నారు. కాకినాడ జిల్లాలో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌, కాకినాడ అర్బన్‌, తాళ్లరేవు, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి తదితర 13 మండలాల్లో 144 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం రెండు జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. చేపల వేట ద్వారా సుమారు 66 వేల కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. సుమారు 600 మేకనైజ్డ్‌, 3 వేల పైబడి మోటరైజ్డ్‌ బోట్లుపై మత్స్యకారులు చేపలవేటను సాగిస్తున్నారు.
పరిహారం ఎప్పుడిస్తారు.?
వేట నిషేధ సమయంలోనే మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం కింద పరిహారం అందించాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భతి ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత లేకుండా పోతోంది. గతంలో చంద్రబాబు పాలనలో వేట నిషేధ పరిహారం రూ.4 వేలు ఉండేది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.10 వేలకు పెంచి నిషేధ సమయంలోనే అందజేసేవారు. అయితే కొందరికే ఈ పథకం కింద పరిహారం అందే పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మత్స్యకారుల ఓట్ల కోసం వలవేసిన కూటమి పెద్దలు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేస్తామంటూ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే పెంచి అందజేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో మాత్రం గత పరిహారం నేటికీ అందలేదు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ఏడాది వేట నిషేధం అమలు కానున్న నేపథ్యంలో పరిహారం ఎప్పుడు ఇస్తారు అనేది మత్స్యకారులకు అర్థం కావడం లేదు. గత పరిహారంతో పాటు ఈ ఏడాది పరిహారం కూడా తక్షణమే నిషేధ సమయంలోనే చెల్లించాలని ఈ సందర్భంగా గంగపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️