ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలి

Nov 27,2024 22:27
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలి

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ హాస్పిటల్స్‌ సూపరింటెండెట్స్‌తో బుధవవారం కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పటల్స్‌ పనితీరు, భవన నిర్మాణాలు, సదరం సర్టిఫికెట్ల జారీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌, తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను గుర్తించి వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా సంతోషంగా జీవించాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో స్నేహ పూర్వకమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రాథమిక, ఏరియా, జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో ఒపి సేవలు, ల్యాబ్‌ టెస్ట్‌లు, ఐపి సేవల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఎన్‌సిడి సిడి 3.0 సర్వే ప్రగతిపై సమీక్షించారు. ఆర్‌సి హెచ్‌ పోర్టల్లో నమోదైన గర్భిణులు, పిల్లల సంఖ్యను మెరుగు పర్చాలని ఆదేశించారు. ప్రతి నెలా పిఎంఎస్‌ఎంఎ కార్యక్రమం కింద గర్భిణులు, స్త్రీలకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై సమీక్షిస్తూ లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న పిహెచ్‌సిల పని తీరు మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు. డెలివరీ కేసులన్నీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించాలని, సుఖ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన జారీ చేయాలన్నారు. కింది సాయి సిబ్బంది నుండి వైద్యాధికారి వరకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. హాస్పిటల్‌ అభివృద్ధి సంఘం నిధుల నుంచి హాస్పిటల్‌కు కావాల్సిన వైద్య పరికరాలు కొనుగోలు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూర్యప్రభ, డిసిహెచ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ పద్మశ్రీరాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎన్‌.వసుంధర పాల్గొన్నారు.

➡️