భగత్ సింగ్ త్యాగం నేటి యువతకు ఆదర్శం

Mar 23,2025 12:41 #East Godavari

ప్రజాశక్తి-కడియం : భారత స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన ప్రాణత్యాగం నేటితరం యువతకు అర్థం కావాలని న్యాయవాది తోరాటి వసంతరావు, భగత్ సింగ్ సేవాసమితి అధ్యక్షులు తమ్మిశెట్టి ప్రసాద్ పేర్కొన్నారు. కడియం లో తమ్మిశెట్టి ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బొబ్బిలిపించి సెంటర్లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు, పువ్వులు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘భగత్ సింగ్ అమర్ రహే’ అంటూ నినాదాలు ఇచ్చారు. భారత స్వాతంత్రం కోసం భగత్ సింగ్ తో పాటు సుఖదేవ్, రాజా గురు ముగ్గురూ నవ్వుతూ ఉరికంబానెక్కిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు అన్నారు. వారి మరణం భారత దేశ ప్రజల్లో ఎంతో స్వాతంత్ర స్ఫూర్తి, చైతన్యం నింపిందన్నారు.నేటి యువత వారి త్యాగాలను తెలుసుకొని సామాజిక బాధ్యతతో, దేశభక్తితో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం మేధావులు భగత్ సింగ్ చేసిన త్యాగాలను సమాజంలో చాటి చెప్పాలన్నారు. ప్రాథమిక పాఠశాల పాఠ్యపుస్తకాలలో స్ఫూర్తి నింపే భగత్ సింగ్ పాఠ్యాంశం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసరావు,  చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, గౌరవాధ్యక్షులు కొత్తూరి బాల నాగేశ్వరరావు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ తోరాటి శ్రీనివాసరావు, కళ్యాణం సూరిబాబు, కొత్తూరి కృష్ణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, తామెళ్ళ వెంకటేశ్వరరావు, మర్రి సుబ్రమణ్యం, శాఖ సురేష్ ఉంగరాల వీరభద్రరావు, అంజి, మర్రి శంకర్, మణి, చిలుకూరి సుబ్బరాజు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

➡️