ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి నూతన సంవత్సరంలో పండగ సమయంలో ప్రజలు పండుగలు జరుపుకోవాలా లేక ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాలను భరించాలా తెలియక ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. ఈ నెల 13న జరుపుకోబోయే భోగి పండుగ మంటల్లో పాత సామాన్లు పడేస్తూ కొత్త సంవత్సరానికి ఎలా నాంది పలుకుతున్నామో ఈ అదనపు కరెంట్ ఛార్జిల బిల్లును వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో కాల్చి వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. స్థానిక శ్యామల సెంటర్ వద్ద పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజలపై కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యుత్ భారాలు మోపిందో వివరించారు. ఒక ఇంటికి డిసెంబర్ నెలలో కాల్చిన కరెంట్‌కు జనవరి నెలలో వచ్చిన బిల్లు రూ.1,125, కరెంట్ బిల్లు వస్తే దానిలో 163 యూనిట్లు వాడితే ఎనర్జీ ఛార్జి, ఫిక్స్డ్ ఛార్జి అన్నీ కలిపి రూ.800 కాగా అదనంగా రూ.417 రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపుతోందని తెలిపారు. 2019, 2020, 2021లో వాడిన యూనిట్లకు కరెంట్ బిల్లు చెల్లించారని, కానీ ఆ యూనిట్లకు అదనంగా ఇప్పుడు యూనిట్‌కు 60 పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీ 1,2,3 అని చెప్పి ఈ నెలలో రు.420 అదనపు భారం వేశారని తెలిపారు. అసలు కరెంట్ బిల్లు రు.800కు అదనంగా సర్దుబాటు ఛార్జిల పేరుతో రు.417 పండగ పూట ప్రజల నెత్తిన భారం మోపారని విమర్శించారు. వైసిపి హయాంలో ఇలానే సర్దుబాటు ఛార్జీలతో భారాలు మోపితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నికల ప్రచారంలో బాదుడే బాదుడు అని చెప్పి ప్రచారం చేశారని తెలిపారు. వైఎస్.జగన్ 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడని, తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం సర్దుబాటు ఛార్జీల పేరుతో 1, 2, 3 అని చెప్పి జనంపై భారాల మోత మోగిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఐ.సుబ్రహ్మణ్యం, నగర కమిటీ సభ్యులు వి.రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరావు పాల్గొన్నారు.