ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాయాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బంది కొరతతో పాటు ప్రధానంగా స్థానిక సంస్థల నుంచి సెస్ వసూలు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మొండి బకాయిలు పేరుకుపోయిన కారణంగా సిబ్బందికి తలనొప్పిగా మారింది.జిల్లా కేంద్రం కాకినాడలో ఒక కేంద్ర గ్రంథాలయంతో పాటు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 102 శాఖా గ్రంథాలయాలు, 14 గ్రామీణ గ్రంథాలయాలు, 145 పుస్తక నిక్షిప్త కేంద్రాల ద్వారా పాఠకులకు సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం వీటిలో సుమారు 14,54,930 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వసతి సమస్యలతో కాకినాడలోని శ్రీనగర్ శాఖా గ్రంథాలయం, జగన్నాథపురం బాలల గ్రంథాలయం మూతపడ్డాయి. దీంతో మొత్తం 36 గ్రంథాలయాలకు గాను 34 గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. అదనంగా 2 గ్రామ గ్రంథాలయాలు, 53 బుక్ డిపాజిట్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రతి రోజూ కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సుమారు 200 మంది, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా మిగతా గ్రంథాలయ శాఖలకు దాదాపు 10 వేల మంది వరకూ పాఠకులు వస్తుంటారని అంచనా. 89,987 మంది డిపాజిట్ చేసిన సభ్యులున్నారు. ఏడాదికి 30 నుంచి 33 లక్షల మంది పాఠకులు గ్రంథాలయాలకు హాజరవుతున్నారు. గుదిబండగా మారిన బకాయిలుఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కాకినాడ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలతో పాటు జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల నుంచి 2007 నుంచి 2023 వరకూ రూ.78,36,20,223 డిమాండ్ ఉండగా ఇప్పటి వరకూ రూ.39,70,53,915 వసూలు కాగా రూ.38,65,66,308 వసూలు కావాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,48,76,463 డిమాండ్‌కు గానూ రూ.4,20,52,149 వసూలు కాగా రూ.5,28,24,314 బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 2007 నుంచి ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం, కాకినాడ నగర పాలక సంస్థల నుంచి రూ.25,49,41,526 బకాయి రావాల్సి ఉంది. అన్ని మున్సిపాలిటీల నుంచి రూ.2,38,47,626, పంచాయతీల నుంచి సుమారు రూ.1,60,60,1,470 బకాయిలు రావాలి. ఇలా ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారిందని గ్రంథాలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులుఏళ్ల తరబడి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. దీంతో పలు గ్రంథాలయాల అభివృద్ధి కుంటు పడుతోంది. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో మంజూరు పోస్టులు 204 వరకూ ఉన్నాయి. వీటిల్లో 62 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 142 ఖాళీలున్నాయి. ఔట్ సోర్సింగ్ ద్వారా 37 మంది విధులు నిర్వహిస్తున్నారు. 56 మంది అదనపు సిబ్బందికి గానూ ఆరుగురు పని చేస్తుండగా ఇంకా 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీస సదుపాయాలు కరువుపలు గ్రంథాలయాల్లో సదుపాయాల లేమితో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల మరుగుదొడ్లు, తాగునీటి సమస్య ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న విధంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. పలు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. కాకినాడలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండడంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ విభాగం రూ.1.20 కోట్లు అంచనా వేసినా నిధుల లేమితో సమస్య పరిష్కారం కావడం లేదు. సెస్ బకాయిలు వసూలు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత భవనంలోనే గ్రంథాలయ నిర్వాహణ జరుగుతోంది. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల నుంచి పెండింగ్‌లో ఉన్న లైబ్రరీ సెస్ చెల్లింపులను అధికారులు విడుదల చేస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.